పొలిటీషియన్ కాదు.. స్ట్రాటజిస్టే: బిహార్ ప్రజల నమ్మకం పొందలేకపోయిన పీకే

పొలిటీషియన్ కాదు.. స్ట్రాటజిస్టే: బిహార్ ప్రజల నమ్మకం పొందలేకపోయిన పీకే

పాట్నా: ఎన్నికల వ్యూహకర్తగా ఇతర పార్టీలను గెలిపించిన ప్రశాంత్ కిశోర్ రాజకీయ నాయకుడిగా మాత్రం ప్రజల మనస్సులు గెలవలేకపోయారు. బిహార్​అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటూ గెలుచుకోకపోవడం చూస్తుంటే.. ప్రజలు ఆయన్ను ఇంకా స్ట్రాటజిస్టుగానే భావిస్తున్నట్టు తెలుస్తున్నది. రెండేండ్లుగా గ్రామగ్రామానా తిరిగి, యాత్రలు చేసి, ఉద్యోగాలు, వలసలు, విద్య, అవినీతి లాంటి సమస్యలు గురించి గొంతెత్తారు. 

కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఫలితాలు సాధించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. పోల్ వ్యూహకర్తగా ఎంతో అనుభవమున్న ఆయన ముందుగానే ఈ విషయాన్ని అంచనా వేశారు. జన్ సురాజ్ పార్టీ ప్రదర్శన మధ్యస్థంగా ఉండదు.. ఉంటే ‘‘అర్ష్ పర్’’ (నింగినంటుతుంది) లేదంటే ‘‘ఫర్ష్ పర్’’ (నేలకరుస్తుంది) అని చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది. అయితే ఆయన పార్టీ 3 శాతానికిపైగా ఓట్లు సాధించడం ఒక ఊరట. 

కులరాజకీయాలు, మత రాజకీయాలు అధిపత్యం వహిస్తున్న బిహార్‎లో ఒక కొత్త పార్టీ చెప్పుకోదగ్గ ఓట్లు సాధించడం చిన్న విషయమేమీ కాదని పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు. లక్షల మంది ఆయన్ను విశ్వసిస్తున్నారని, ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని ఇది స్పష్టం చేస్తుందన్నారు. అయితే ఇది ప్రశాంత్​కిశోర్ నిరాశతో వెనక్కి తగ్గే సమయం కాదని ఈ పునాదులపై పార్టీని నిర్మించుకుంటే భవిష్యత్తులో అనూహ్య ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు.

ఓటమి కారణాలేంటో విశ్లేషించుకుంటం

ఎన్నికల ఫలితాల తర్వాత జేఎస్పీ అధికార ప్రతినిధి పవన్ కె.వర్మ మీడియాతో మాట్లాడుతూ “మేం చాలా నిజాయితీగా పనిచేశాం. బిహార్​లో పెద్ద మార్పు వస్తుందని భావించాం. కానీ ప్రజల నమ్మకం పొందలేకపోయాం. ఇప్పుడు దాన్ని పొందడం గురించి ఆలోచిస్తం” అని అన్నారు. జేఎస్పీ ఓటమికి కారణాలు ఏమిటో సమీక్షించుకుంటామని చెప్పారు. 

మా ఆలోచనల్లో తప్పు లేదని.. అయితే ఫలితాలు మాత్రం నిరాశపరిచాయని అన్నారు. అయితే మా వల్ల బిహార్​లో ఒక మంచి పరిణామం చోటుచేసుకుందని.. ఉద్యోగాలు, విద్య, అవినీతి నిర్మూలన వంటి అంశాలు ఇప్పుడు అన్ని పార్టీల అజెండాలోకి వచ్చాయన్నారు. ప్రశాంత్ కిశోర్ బిహార్ వదిలేస్తారా అని రిపోర్టర్లు అడగ్గా.. “అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. కానీ బిహార్ ఆయన్ని వదలదు, ఆయన బిహార్‌‌ను వదలరు” అని అన్నారు.