ENG vs IND 2025: రెండో టెస్టులో టీమిండియాకు బిగ్ ఛాలెంజ్.. బుమ్రాతో పాటు మరో ఫాస్ట్ బౌలర్ ఔట్!

ENG vs IND 2025: రెండో టెస్టులో టీమిండియాకు బిగ్ ఛాలెంజ్.. బుమ్రాతో పాటు మరో ఫాస్ట్ బౌలర్ ఔట్!

ఇంగ్లాండ్ తో జరగబోయే రెండో టెస్టు భారత జట్టుకు అగ్ని పరీక్షగా మారింది. జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు బుధవారం (జూన్ 25) బర్మింగ్‌హామ్‌కు చేరుకుంది. టీమిండియా తొలి శిక్షణా సెషన్ బర్మింగ్‌హామ్‌లో జరిగింది. ఈ ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా మన క్రికెటర్లు తీవ్రంగా కసరత్తులు చేశారు. అయితే ఈ ప్రాక్టీస్ సెషన్ కు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ దూరమయ్యారు. వీరిద్దరూ తప్పితే మిగిలిన భారత క్రికెటర్లు ప్రాక్టీస్ లో బిజీగా కనిపించారు. 

బుమ్రా ఇప్పటికే రెండో టెస్ట్ కు దూరమవ్వడం దాదాపుగా ఖాయమైంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు రెండో టెస్టులో రెస్ట్ ఇవ్వనున్నారు. ఈ టెస్టుకు బుమ్రాతో పాటు ప్రసిద్ కృష్ణ కూడా దూరం కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో ప్రసిద్ వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ పేసర్ ఓవర్ కు 6 ఎకానమీతో పరుగులు ఇవ్వడం కూడా ఓటమికి ఒక కారణం. దీంతో రెండో టెస్టులో ప్రసిద్ కృష్ణపై వేటు పడనున్నట్టు సమాచారం. ప్రాక్టీస్ సెషన్‌లో అన్‌క్యాప్డ్ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్ లతో కలిసి గంభీర్‌ దీర్ఘంగా చర్చించాడు. 

అర్షదీప్ సింగ్ రెండో టెస్ట్ ద్వారా టెస్ట్ అరంగేటర్మ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆకాష్ డీప్ కు సైతం ఈ మ్యాచ్ లో ఛాన్స్ దక్కొచ్చని టాక్. సిరాజ్ జట్టులో కొనసాగనున్నాడు. తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ లేదా నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులో స్థానం సంపాదించుకోవచ్చు. బ్యాటింగ్ లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగవచ్చు. ఎడ్జ్ బాస్టన్ లో టీమిండియాకు ఒక్క విజయం కూడా లేకపోవడం కలవరపెడుతుంది. ఈ గ్రౌండ్ లో  మొత్తం 8 టెస్టులాడితే 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా తో సరిపెట్టుకుంది.