కుమ్రం భీం ఎస్పీ సురేశ్​ను బదిలీ చేయాలి: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కుమ్రం భీం ఎస్పీ సురేశ్​ను బదిలీ చేయాలి: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ ను బదిలీ చేస్తే తప్ప జిల్లాలో పారదర్శకంగా ఎన్నికలు జరగవని, ఆయన ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకు నగదు, మద్యం పంపిణీకి సహకరిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎస్పీని బదిలీ చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. కాగజ్ నగర్​లోని పార్టీ ఆఫీసులో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఎస్పీ సురేశ్​కుమార్ స్థానిక బీఎస్పీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ భయపెడుతున్నారన్నారు. కోనప్పతో కలిసి బినామి పేర్లతో అక్రమ వ్యాపారాలు చేస్తున్నారన్నారు. ఎస్పీని బదిలీ చేయాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు.  

మెదక్​ జిల్లాకు గద్దర్​ పేరు...ఫ్రీడమ్ ​వర్సిటీ 

బీఎస్పీని గెలిపిస్తే ఆక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసి, నకిలీ విత్తనాల బెడద మంచి రైతులకు విముక్తి కల్పిస్తామని ప్రవీణ్​కుమార్​ హామీ ఇచ్చారు. బీఎస్పీ మేనిఫెస్టో పూర్తిగా అమలు చేసే బాధ్యత తమదేనన్నారు శ్రీకాంతాచారి ఉద్యోగ హామీ ద్వారా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కాన్షీరాం యువ సర్కార్ పేరుతో యువతను షాడో మంత్రులుగా నియమిస్తామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామన్నారు. ఏటా రూ.25 వేల కోట్లతో ప్రజారోగ్య బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. మెదక్ జిల్లాకు గద్దర్ పేరు పెట్టి, ఆయన స్మారకంగా ఫ్రీడమ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 

ప్రతి జిల్లాలో అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ బిజినెస్ సెంటర్లు, పూర్ణ- ఆనంద్ క్రీడా స్ఫూర్తితో ప్రతి జిల్లాలో అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడల్లో రాణించే స్టూడెంట్లకు ప్రతి నెల రూ.15వేలు స్కాలర్​షిప్స్, స్పోర్ట్స్​కిట్లు, పోషకాహారాన్ని అందజేస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక విధానాలు రూపొందిస్తామని, ప్రతి రైతుకు గ్రీన్ కార్డు ఇస్తామన్నారు. రైతుకు ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇంటి వద్దకే ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందజేస్తామన్నారు. 

ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. జనాభాలో 99 శాతం ఉన్న పేద వర్గాలకు రాజ్యాధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఎస్పీలో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, అసెంబ్లీ అధ్యక్షులు డోకె రాజన్న, ముస్తఫీజ్ హుస్సేన్, తన్నీరు పోచం, షబ్బీర్ హుస్సేన్, సీతానగర్ ఎంపీటీసీ జామున మహేశ్, నక్క మనోహర్, సిద్ధం శ్రీనివాస్ పాల్గొన్నారు.