IPL 2024: హార్దిక్ దేశం కోసం ఆడేవాడు కాదు.. అతనికి డబ్బే ముఖ్యం: భారత మాజీ క్రికెటర్

IPL 2024: హార్దిక్ దేశం కోసం ఆడేవాడు కాదు.. అతనికి డబ్బే ముఖ్యం: భారత మాజీ క్రికెటర్

భారత్ వేదికగా స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే. సర్జరీ చేయించుకొని దాదాపు 5 నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న ఈ ఆల్ రౌండర్.. ఇటీవలే మైదానంలోకి అడుగు పెట్టాడు. ముంబై డీవై పాటిల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతూ కనిపించాడు. ఐపీఎల్ కు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ పాండ్యపై తీవ్ర ఆరోపణలు చేశాడు. 

"ఐపీఎల్‌కు రెండు నెలల ముందు పాండ్య గాయపడ్డారు. గాయం నుంచి కోలుకొని అతను దేశం కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు. దేశవాళీ క్రికెట్‌లో రాష్ట్రం కోసం ఆడకుండా  నేరుగా ఐపీఎల్ ఆడటానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. డబ్బు సంపాదించడంలో తప్పు లేదు. కానీ డబ్బు మాయలో దేశం, రాష్ట్రంని వదిలేయడం కరెక్ట్ కాదు". అని ప్రవీణ్ కుమార్ అన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ రోహిత్ శర్మ మరో రెండు, మూడు సంవత్సరాలు కెప్టెన్సీ చేయగలడు. కానీ చివరికి, నిర్ణయం మేనేజ్‌మెంట్ చేతిలో ఉంటుంది. అని చెప్పాడు.    

ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో 10 ఏళ్ళ నుంచి ముంబై జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు బ్రేక్ పడింది. ఫామ్ లో ఉన్నా, కెప్టెన్ గా మంచి రికార్డ్ ఉన్నా.. హిట్ మ్యాన్ ను పక్కన పెట్టడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియలేదు.

2022,2023 లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్య నాయకత్వం వహించాడు. అంచనాలు లేకుండా తొలి ప్రయత్నంలోనే హార్దిక్  టైటిల్ అందించాడు. ఇక 2023 సీజన్ లో గుజరాత్ జట్టును ఫైనల్ కు చేర్చాడు. మరోవైపు రోహిత్ శర్మ ఇటీవలే టీ20 కెప్టెన్సీపై ఆసక్తి లేదని చెప్పడంతో ముంబై ఫ్రాంచైజీ కన్ను హార్దిక్ మీద పడింది. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ నడపడానికి హార్దిక్ సరైనోడు అని భావించి కెప్టెన్సీ అప్పగించారు. ప్రస్తుతం టీమిండియాకు వైస్ కెప్టెన్ గా ఉంటున్న హార్దిక్ కు కెప్టెన్సీ ఇవ్వడంలో ఆశ్చర్యానికి గురవ్వాల్సిన పని లేదని కొంతమంది క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.