WPL 2024: షబ్నమ్ షకీల్ అదరహో..ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తెలుగమ్మాయి హవా

WPL 2024: షబ్నమ్ షకీల్ అదరహో..ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తెలుగమ్మాయి హవా

మహిళల ప్రీమియర్ లీగ్ లో స్టార్ ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఇందులో ఆశ్చర్యం లేకపోయినా మొదటసారి ఒక తెలుగమ్మాయి ఈ మెగా లీగ్ లో సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ పట్నంకు చెందిన షబ్నమ్ షకీల్ టాప్ స్పెల్ తో గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. నాలుగు ఓవర్ల స్పెల్ లో ఈ 16 ఏళ్ళ తెలుగమ్మాయి కేవలం 11 పరుగులే ఇచ్చి 3 కీలక  వికెట్లు పడగొట్టింది. 

ఈ మీడియం పేసర్ ధాటికి యూపీ వారియర్స్ ప్రారంభంలో వరుసగా వికెట్లను కోల్పోయింది. తొలి 7 ఓవర్లలోనే తన నాలుగు ఓవర్ల  స్పెల్ ను పూర్తి చేసి యూపీ వారియర్స్ పరాజయాన్ని ఖారారు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. నిన్న (మార్చి 11) జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ మూనీ ఒంటరి పోరాటంతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వాల్వోర్ట్ 43 పరుగులు చేసి రాణించింది.  వీరిద్దరూ మినహా మిగిలినవారెవరూ రాణించలేదు. 

లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 35 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఈ దశలో దీప్తి శర్మ అసాధారణ ఇన్నింగ్స్ తో ఔరా అనిపించింది. 60 బంతుల్లోనే 88 పరుగులు చేసి గుజరాత్ ను వణికించింది. అయితే కొట్టాల్సిన లక్ష్యం మరీ ఎక్కువ ఉండడంతో యూపీకి పరాజయం తప్పలేదు.