దశాబ్దిలోకి తెలంగాణ : రూ.100 కోట్ల ఉత్సవాలకు.. రూ.150 కోట్లతో ప్రచారం

దశాబ్దిలోకి తెలంగాణ : రూ.100 కోట్ల ఉత్సవాలకు..  రూ.150 కోట్లతో ప్రచారం

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కోసం రూ.102 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఉత్సవాలను గురించి ప్రచారం చేసుకోవడానికి  మాత్రం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నది. బడ్జెట్ లో సీఎం స్పెషల్​డెవలప్​మెంట్​ ఫండ్ కింద రూ.10 వేల కోట్లు కేటాయించుకొని, సొంత ప్రచారం కోసం రూ.1000 కోట్లు కేటాయించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు రూ.5 వేల కోట్లు మాత్రం విడుదల చేయట్లేదు? మన ఊరు–మనబడి పథకం పనులను రూ.7 వేల కోట్లు కమీషన్లు ఇచ్చే కంపెనీలకు కట్టబెట్టడంపై ఉన్న శ్రద్ధ, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ సకాలంలో ఇవ్వడంపై ఎందుకు లేదు? ఐఐఐటీ బాసర విద్యార్థులు ఒక్కసారి రాష్ట్ర సీఎం మా యూనివర్సిటీ సందర్శించాలని 20 రోజులు ధర్నా చేస్తే ఎందుకు పోలేదో సమాధానం చెప్పాలి. 

ఈ పదేండ్లలో ఎన్ని గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించారో ప్రజలకు చెప్పాలి. కనీసం టాయిలెట్స్ కూడా లేని స్కూళ్లలో, బాత్రూంలలో కుక్కలు పడుకునే కాలేజీల్లో విద్యాదినోత్సవం ఎలా జరుపుతారు? 30 లక్షల మంది నిరుద్యోగ యువత పేపర్ లీకేజీ సమస్యతో అయోమయంలో ఉంటే, కనీసం ఆ మాట కూడా ఎత్తని సీఎం విద్య గురించి ఏం మాట్లాడతారు? ఇప్పటికీ 20 వేల టీచర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. విద్యావాలంటీర్లను నియమించుకునే అవకాశం లేదు. వీటన్నింటికీ సమాధానం చెప్పకుండా ఎలా విద్యా ఉత్సవాలు జరుపుతారు?
‌‌
 – - డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, బహుజన్ సమాజ్ పార్టీ