ములక్కాడ పేరు చెప్పంగనే టక్కున గుర్తొచ్చే వంటకం సాంబార్. కానీ, ఈ హెల్దీ వెజిటబుల్తో మరెన్నో టేస్టీ రెసిపీలున్నాయి. ములక్కాడ– పెరుగు కర్రీ తింటుంటే తినాలనిపిస్తుంది. వీటిని రొయ్యలు, కోడిగుడ్లతో కలిపి వండితే ఆ రుచే వేరు. ఈ టేస్టీ రెసిపీలని ఇలా తయారుచేసుకోవాలి..
ములక్కాడ-కోడిగుడ్డు పులుసు
కావాల్సినవి:
ములక్కాడ ముక్కలు– ఒక కప్పు కోడిగుడ్లు(ఉడికించి)– మూడు
ఆవాలు– పావు టీ స్పూన్
నూనె– తగినంత, ఎండుమిర్చి– రెండుమూడు
జీలకర్ర, మెంతులు– కొద్దిగా, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉల్లిగడ్డ తరుగు– ఒక కప్పు
ఉప్పు, కారం– తగినంత, కొబ్బరి పొడి– ఒక టీ స్పూన్, నువ్వులు, పల్లీల పొడి– ఒక టీ స్పూన్
టొమాటో తరుగు– ఒక కప్పు, చింతపండు రసం– తగినంత, పసుపు, ఇంగువ– చిటికెడు
అల్లం– వెల్లుల్లి పేస్ట్– ఒక టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు– నాలుగైదు
ధనియాల పొడి– అర టీ స్పూన్
కొత్తిమీర– పావు కప్పు
తయారీ: కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. అందులో ఉప్పు , కొబ్బరి పొడి , పల్లీ– నువ్వుల పొడి కూడా వేయాలి. కొంచెం దగ్గరపడ్డాక టొమాటో తరుగు , చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, అల్లం– వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, ధనియాల పొడి వేసి ఇంకాసేపు ఉడికించాలి. తరువాత ములక్కాడ ముక్కలు వేసి, సరిపడా నీళ్లు పోసి చిక్కబడే వరకు ఉడికించాలి. తరువాత ఉడికించిన కోడిగుడ్లు వేస్తే ములక్కాడ కోడిగుడ్డు పులుసు రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తింటే బాగుంటుంది.
ములక్కాడ –రొయ్యలు
కావాల్సినవి:
రొయ్యలు– పావు కేజీ, ములక్కాడ ముక్కలు– అర కప్పు, టొమాటో తరుగు– పావుకప్పు
ఉల్లిగడ్డ తరుగు– అర కప్పు, చింతపండు రసం– పావుకప్పు, కారం, ఉప్పు– తగినంత
పసుపు– పావు టీ స్పూన్, నూనె– తగినంత
ధనియాల పొడి– అర టీ స్పూన్, గరం మసాలా– పావు టీ స్పూన్, కొత్తిమీర తరుగు– పావు కప్పు
తయారీ:
పాన్లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ , టొమాటో తరుగు వేసి వేగించాలి. అందులో ధనియాల పొడి, కారం, పసుపు, ములక్కాడ ముక్కలు, రొయ్యలు ఒకదాని తర్వాత ఒకటి వేసి సన్నటి మంట మీద మగ్గబెట్టాలి. ఆ తర్వాత ఉప్పు, చింతపండు రసం కూడా వేసి ఇరవై నిమిషాలు ఉడికించాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేస్తే నోరూరించే ములక్కాడ రొయ్యల కూర రెడీ.
ములక్కాడ - పెరుగు పచ్చడి
కావాల్సినవి:
ములక్కాడ ముక్కలు– ఒక కప్పు, పెరుగు– రెండున్నర కప్పులు, ఆవాలు– పావు టీ స్పూన్
ఎండుమిర్చి–నాలుగైదు, జీలకర్ర– పావు టీ స్పూన్
మినపగుండ్లు–ఒక టీ స్పూన్, పసుపు–చిటికెడు, పచ్చిమిర్చి(నిలువుగా చీల్చి)– రెండుమూడు, కరివేపాకు–కొద్దిగా, ఇంగువ – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు–నాలుగైదు, చిన్న ఉల్లిగడ్డలు– ఆరు, కారం, ఉప్పు– తగినంత, మెంతులు, ధనియాలు, జీలకర్ర పొడి– ఒక్కోటి పావు టీ స్పూన్ చొప్పున, కొత్తిమీర– రెండు టీ స్పూన్లు, నూనె– సరిపడా
తయారీ:
పాన్లో కొంచెం నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేగించాలి. అందులో మినపగుండ్లు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి దగ్గరపడ్డాక స్టవ్ ఆపేయాలి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారాక పెరుగులో పోసి బాగా కలపాలి. మరొక పాన్లో నూనె వేడిచేసి వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసిన ములక్కాడ ముక్కలు, చిన్న ఉల్లిగడ్డలు వేసి వేగించాలి. అవి కాస్త మగ్గాక ఉప్పు, కారం, మెంతి, ధనియా, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కొన్ని నీళ్లు పోయాలి. ములక్కాడలు పూర్తిగా ఉడికాక స్టవ్ ఆపి.. ఆ మిశ్రమం చల్లారాక పెరుగులో కలిపితే వంటకం రెడీ.
