ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌‌ వచ్చేసింది! ఏడాదికి రూ.3 వేలు లేదంటే 200 ట్రిప్పులు.. సింపుల్గా ఇలా రిజిస్టర్ చేసుకోండి..

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌‌ వచ్చేసింది! ఏడాదికి రూ.3 వేలు లేదంటే 200 ట్రిప్పులు.. సింపుల్గా ఇలా రిజిస్టర్ చేసుకోండి..
  • ఏడాదికి రూ.3 వేలు లేదంటే 200 ట్రిప్పులు
  • ఒక్కో టోల్ గేట్ క్రాస్.. ఒక్కో ట్రిప్ కింద లెక్క
  • రాజ్​మార్గ్ యాత్ర యాప్ ద్వారా రిజిస్టర్
  • వైట్ నంబర్ ప్లేట్ వెహికల్స్​కు మాత్రమే వర్తింపు

హైదరాబాద్, వెలుగు: టోల్​గేట్ యాన్యువల్ పాస్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఏడాదికి 200 టోల్ క్రాసింగ్​లు లేదంటే రూ.3వేలు చెల్లించి సంవత్సరం పాటు నేషనల్ హైవేలపై ప్రయాణించే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఈ లెక్కన ఒక్కో టోల్​ప్లాజాకు రూ.15 ఫీజు చెల్లించినట్లు అవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పాస్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక టోల్ గేట్ క్రాస్ అయితే.. దాన్ని ఒక ట్రిప్ కింద లెక్కిస్తామని ఎన్​హెచ్ఏఐ అధికారులు తెలిపారు. వైట్ నంబర్ ప్లేట్ వెహికల్స్​కు మాత్రమే ఈ యాన్యువల్ పాస్ వర్తిస్తుంది. 

ఎలా రిజిస్టర్ చేసుకోవచ్చు?

  • పాస్ తీసుకోవాలంటే.. ముందుగా ప్లే స్టోర్ నుంచి రాజ్​మార్గ్ యాత్ర యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలి. 
  • నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) వెబ్ సైట్ నుంచి కూడా ఈ పాస్ తీసు కోవచ్చు. మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది.
  • లాంగ్వేజ్ సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత యాన్యువల్ పాస్ ను సెలక్ట్ చేసుకోవాలి.
  •  కమర్షియల్ వెహికల్స్, కారు, జీప్, యాక్టివ్ ఫాస్​ట్యాగ్ ఉన్నవాళ్లే అర్హులని చూపిస్తుంది.
  •  తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హైవేలపై ఉన్న టోల్ ప్లాజా మ్యాప్ ప్రత్యక్షం అవుతుంది. ఒక టోల్ ప్లాజాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింగిల్ జర్నీకి ఎంత, రిటర్న్ జర్నీకి ఎంత, నెల పాస్ ఎంత అనే వివరాలు కనిపిస్తాయి.
  •  తర్వాత వెహికల్ నంబర్ ఎంటర్ చేస్తే పేమెంట్ మోడల్ లోకి వెళ్తాం. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలి. సక్సెస్​ఫుల్ అని వస్తది.
  • ఎక్స్ ప్రెస్ వేపై ఎన్ని టోల్ ప్లాజాలు ఉన్నా.. ఎగ్జిట్ దగ్గర టోల్ కట్ అవుతుంది. అప్పుడు ఇది ఒకే ట్రిప్ కిందికి వస్తుంది.
  • రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హైవేస్​, స్టేట్ హైవేస్ కలిపి మొత్తం 36 టోల్ ప్లాజాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవే ఎన్ 65 మీద 3 ఉండగా (2 తెలంగాణ, ఒకటి ఏపీ). హైదరాబాద్ – బెంగళూరు హైవే ఎన్ హెచ్ 44 మీద 3, హైదరాబాద్​– నాగ్​పూర్ నేషనల్ హైవే 44 మీద అత్యధికంగా 5 టోల్ ప్లాజాలు ఉన్నాయి.

ఆర్థిక భారం తగ్గించేందుకే..

టోల్ ఫీజుల నుంచి ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం యాన్యువల్ పాస్ తీసుకొచ్చింది. ఆన్​లైన్​లోనే పాస్ కొనాలి. ఫాస్టాగ్ ఉన్నవాళ్లు అదే ఉపయోగించొచ్చు. ఎక్కువ జర్నీ చేసేవారికి ఈ పాస్ ఉపయోగకరంగా ఉంటుంది. టోల్​ప్లాజాల వద్ద కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

200 ట్రిప్​లు ఫ్రీగా ఉంటాయి. టోల్​ప్లాజాల వద్ద పాస్ ఇచ్చే సెంటర్లను ఇంకా ఏర్పాటు చేయలేదు. డిమాండ్​ను బట్టి టోల్ ప్లాజాల వద్ద యాన్యువల్ పాస్ కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. ట్రిప్​కు యావరేజ్​గా రూ.15 మాత్రమే కట్ అవుతుంది.

శివ శంకర్, తెలంగాణ రీజినల్ ఆఫీసర్, ఎన్​హెచ్​ఏఐ