
ఆదిలాబాద్ జిల్లా అంటేనే అందమైన అడవులు. పచ్చటి వాతావారణం, ఎత్తైన జలపాతాలు. ఆదివాసీల గుడిసెలు, ఎటు చూసినా పచ్చని చెట్లతో లొకేషన్స్ అన్నీ ‘వావ్’ అనేలా ఉంటాయి. వాటిల్లో ఒకటి కడెం ప్రాజెక్ట్. ఒకవైపు ప్రాజెక్ట్, మరోవైపు పచ్చని చెట్లతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ లొకేషన్స్ సినిమా వాళ్లను కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రి - వెడ్డింగ్ షూట్లకు కేరాఫ్ అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రి వెడ్డింగ్ షూటింగ్‌ల ట్రెండ్ నడుస్తోంది. పెండ్లికి ముందు పిల్ల, పిల్లగాడు ఇద్దరు మంచి స్పాట్‌కు పోయి ఫొటోలు దిగుడు మామూలే. ఆ ఫొటోలు బాగా రావాలంటే లొకేషన్ బాగుండాలి. అట్లాంటి స్పాటే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్. కేవలం ప్రి వెడ్డింగ్ షూట్లకు మాత్రమే కాదు.. షార్ట్‌ఫిలిమ్స్ తీసుకునేందుకు కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. నిర్మల్ జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ కడెం. అడవి తల్లి ఒడిలో, ప్రకృతి అందాల మధ్య ఉంటుంది. అందుకే, ఈ ప్రాజెక్ట్‌ను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తున్నారు. ఇక వీకెండ్స్లోనైతే జనాలతో కిటకిటలాడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి పర్యాటకులు వచ్చి ఆ అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకృతి పలకరింపులను తమ కెమెరాల్లో బంధించుకుని వెళ్తున్నారు.
సినిమా షూటింగ్స్
కడెం ప్రాజెక్ట్ దగ్గర వరద గేట్లు, బోటింగ్ పాయింట్, మెయిన్ కెనాల్, ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న అడవులు, రిజర్వాయర్, హరిత రిసార్ట్, గెస్ట్ హౌస్ ఇవన్నీ షూటింగ్ చేసేందుకు అనువుగా ఉన్నాయని చెప్తున్నారు ఫొటోగ్రాఫర్లు, స్థానికులు. “ ఒకప్పుడు ఆదిలాబాద్ అనగానే కుంతాల జలపాతం మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు కడెం ప్రాజెక్ట్ కూడా వచ్చి చేరింది. ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయ’’ని అంటున్నారు ప్రి– వెడ్డింగ్ షూట్స్ చేసే ఫొటోగ్రాఫర్లు. ఇక్కడే ఉండి షూటింగ్‌లు చేసుకునేందుకు వీలుగా హరిత రిసార్ట్స్ ఉన్నాయి. - కడెం, వెలుగు