కోవిడ్ అంటకుండా ముందు జాగ్రత్త

కోవిడ్ అంటకుండా ముందు జాగ్రత్త

చైనా వాళ్లకు కొవిడ్​ తీసుకొచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరుకులు కొందామంటే షాపులు బంద్​. ఇంట్లో వాళ్లను కల్వకుండా క్వారెంటైన్​లో బందీ. ఊరు దాటి పోకుండా ఇండ్లల్లనే చెర. ఒక్కటి కాదు.. రెండు కాదు.. వాళ్ల బాధ మాటల్లో చెప్పడం కష్టం. ఇవన్నీ కొవిడ్​ ఇంకొకళ్లకు అంటకుండా చైనా తీసుకుంటున్న జాగ్రత్తలు మరి. అవే కాదు, మరికొన్ని ఆసక్తికరమైన చర్యలూ చేపట్టింది. అందులో ఇవి కొన్ని.

రేయింబవళ్లు.. సూట్లు కుట్టు

కొవిడ్​ అంటకుండా ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నం. మాస్కులు పెట్టుకుంటున్నం. చేతులకు గ్లోవ్స్​ తొడుక్కుంటున్నం. ఒంటికి రక్షణ కవచం లాంటి సూట్లు వేసుకుంటున్నం. మరి, ఎంతమందికని ఉన్న సూట్లు సరిపోతయి. అందుకే, చైనా హెబి ప్రావిన్స్​లోని నింగ్జిన్​ కౌంటీలో ఉన్న ఓ వర్క్​షాప్​లో వర్కర్లు రేయింబవళ్లు సూట్లు కుడుతూనే ఉన్నరు. కుట్టిన సూట్లకు ఇట్టే గిరాకీ తగులుతోంది. స్టాకు ఖాళీ అవుతోంది. వర్కర్లకు చేతి నిండా రెస్ట్​ లేని పని దొరుకుతోంది.

అమ్మేటోళ్లుండరు.. మనమే కూరలు తీస్కోవాలె

ఎంత కొవిడ్​ వచ్చినా కడుపు నిండనిది పని జరగదు. కడుపు నిండాలంటె.. వంట వండాలె. దానికి కూరలు తేవాలె. కూరగాయల దుకాణాలైతే ఓపెన్​ ఉన్నయిగానీ, అమ్మేటోళ్లే లేరే. అయినా, ఏం ఫర్వాలేదు. అక్కడ పైసలు పెట్టి ఎవరికి కావాల్సిన కూరగాయలు వాళ్లు పట్టుకెళ్లిపోవచ్చు. ఈ స్టాళ్లను ఈమధ్యే హెబి ప్రావిన్స్​లోని షిన్హువా జిల్లాలో ఏర్పాటు చేసిన్రు.

రోబోలు.. స్వచ్ఛ ఆస్పత్రులు

కొవిడ్​ రోగులతో హాస్పిటళ్లు కిక్కిరిసిపోతున్నయి. మరి, ఆ హాస్పిటళ్లను మనుషులు క్లీన్​ చేస్తే ఎక్కడో ఓ చోట ఆ వైరస్​ పట్టుకునే చాన్స్​ ఉంటుంది. అందుకే ఆ చాన్స్​ వైరస్​లకు ఇవ్వకుండా, రోబోలు ‘స్వచ్ఛ ఆస్పత్రుల మిషన్​’ చేస్తున్నయి. షాండాంగ్​ ప్రావిన్స్​లోని ఖింగ్​డావ్​ హాస్పిటళ్లలో ఈ రోబో క్లీనర్లు ఇప్పటికే డ్యూటీ ఎక్కేసిన్రు.

డ్రోన్లు టోల్ తీస్కుంటున్నయ్

టోల్​గేట్​ దగ్గర బిల్లు కట్టాలంటే ముందు బండెనక బండి క్యూ కట్టాలె. ఒక్కటి అయిపోయినంకనే ఇంకోటి కదలాలె. కౌంటర్​ దగ్గర టోల్​ కలెక్టర్​కు పైసలు కట్టాలె. కానీ, అక్కడ కొవిడ్​ సోకితే..? అందుకే ఆ ఇబ్బందుల్లేకుండా డ్రోన్లే టోల్​ తీస్కుంటున్నయి. బండ్లు క్యూ కట్టకుండా, క్యూఆర్​ కోడ్​తో స్కాన్​ చేసి పైసలు తీస్కుంటున్నయి. గ్వాండాంగ్​ ప్రావిన్స్​లోని షెంజెన్​లో కథ ఇది.

పైసలు క్లీన్ చేస్తున్నరు.. క్వారెంటైన్లో పెడుతున్నరు

పైసలతో మనిషి బంధం విడదీయలేనిది. అయి లేనిది బతుకుబండి ముందుకు సాగదాయె. కానీ, ఆ పైసలే బతుకుబండికి జబ్బులు తెప్పిస్తే పరిస్థితేంటి? కొవిడ్​ భయాలు ఇప్పుడు చైనా కరెన్సీ నోట్లను చుట్టుముట్టేస్తోంది. అందుకే పైసలను అధికారులు క్లీన్​ చేస్తున్నరు. వాటినీ 14 రోజుల పాటు క్వారెంటైన్​లో పెడుతున్నరు. అవును మరి, నోట్లు ఒక చెయ్యి నుంచి మరొక చెయ్యి మారుతయ్‌‌ కదా. కొవిడ్​ సోకినోళ్ల దగ్గరా నోట్లుంటయి కదా. అవి వేరే వాళ్ల దగ్గరకు పోతయి కదా. అప్పుడు ఆ నోట్లకూ వైరస్​ అంటుకునే ప్రమాదముంటుంది కదా. అందుకే  ఇదంతా. అంతేకాదు, వీలైనంత తొందరగా కొత్త నోట్లను మార్కెట్లోకి తెమ్మని అక్కడి సెంట్రల్​ బ్యాంకు పెద్దాయన ఫాన్​ యిఫి ఆర్డరేసిండు. ఇప్పటికే 400 కోట్ల యువాన్ల కొత్త నోట్లను హుబెయ్​ ప్రావిన్స్​లో రిలీజ్​ చేసిన్రు కూడా.

ఆలూమగలు…వారానికోసారే కలవడం

ఆమె ఓ మెడికల్​ ఆఫీసర్​. ఆయనో పోలీస్​ ఆఫీసర్​. ఇద్దరూ భార్యాభర్తలు. కలిసి బతకాల్సిన వాళ్లిద్దరూ ఇప్పుడు వారానికోసారి మాత్రమే కలుసుకుంటున్నారు. మాటముచ్చట చెప్పుకుంటున్నారు. ఇదంతా కొవిడ్​ ఎఫెక్ట్​. యాంగ్​ చెన్హువా ఝౌషన్​లోని దింఘాయి ఆఫీస్​లో పోలీస్​ ఆఫీసర్​గా పనిచేస్తున్నాడు. ఫాంగ్​ మెంగ్షియా అక్కడే మెడికల్​ స్టాఫ్​ మెంబర్​. వాళ్లిద్దరూ కొవిడ్​పై పోరాటంలో భాగమయ్యారు. ఈ నేపథ్యంలోనే వాళ్లు కుటుంబంతో గడపలేకపోతున్నారు. వారానికి ఒకసారి మాత్రమే ఝౌషన్​ చెక్​పాయింట్​ వద్ద కలుసుకుని కాసేపు మంచి చెడులు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు తలమునకలైపోతున్నారు.