
ఆస్తమా… ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. చాలా మందిని వేధిస్తున్న సమస్య. తిండి, అలవాట్లు, జీన్స్ వల్ల.. ఇలా ఎన్నో కారణాలతో వచ్చే ఆస్తమాను అవగాహనతో దూరంగా పెట్టొచ్చు. వచ్చినా దానిని తెలివిగా తగ్గించుకోవచ్చు అంటున్నారు డాక్టర్ టీఎల్‌ఎన్ స్వామి. ఆస్తమాతో బాధపడేవాళ్లు పల్లెటూళ్లలో కంటే పట్టణాల్లోనే ఎక్కువ. పేదల కంటే మధ్య తరగతికి చెందిన వాళ్లు, ధనికులే ఎక్కువగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఎందుకో తెలుసుకోండి.
ధుమ్ము, ధూళి, వాసనలు, వాయువులు, మరేదైనా పదార్థం ఎక్స్‌పోజ్ అయినప్పుడు శరీరం ఓవర్‌గా రియాక్ట్ అయితే దానిని అలర్జీ (హైపర్ సెన్సిటివిటీ) అంటారు. శరీర భాగాల్లో అలర్జీ ఎక్కడైనా రావొచ్చు. శరీరం ఓవర్‌గా రియాక్ట్ అయ్యే గుణం కొందరిలో పుట్టుకతోనే ఉంటుంది. అలర్జీ వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ పోవచ్చు. లేదా అలాగే ఉండిపోవచ్చు.
ఆస్తమా ఎందుకొస్తుంది?
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, గాలిలో దుమ్ము, ధూళి, గాలిలోని కలుషిత వాయువులు, కొన్ని రకాల వాసనలు, బ్యాక్టీరియా, వైరస్‌లకు కొందరి ఊపిరితిత్తులు అతిగా స్పందిస్తాయి. దీనినే ‘ఆస్తమా’ అంటారు.
కిచెన్‌లో పోపుల వాసన,మస్కిటో కాయిల్స్, అగరబత్తీలు, సెంట్స్, డియోడరెంట్స్, పౌడర్లు, స్ప్రేలు, స్మోక్, ఘాటైన రసాయనాల వాసనలు, ఎయిర్ ఫ్రెషనర్స్ పడకపోతే అస్తమా వస్తుంది. పక్కవాళ్లు పొగతాగినా ఆస్తమా వస్తుంది.
ఆస్తమాకు ప్రధానమైన కారణం పొల్యూషన్. డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉన్న గాలి పీల్చితే ఆ ధూళి కణాలు ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ కలిగిస్తాయి. గాలిలో ఉండే కాలుష్య సంబంధ వాయువులు సల్ఫర్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ కలిగిస్తాయి. బయటి కాలుష్యమే కాదు ఇండోర్ అంటే ఇంటి కాలుష్యం కూడా ఆస్తమాకి కారణమవుతుంది. ఏసీలు, ఫ్రిజ్‌ల నుంచి విడుదలయ్యే వాయువుల ప్రభావం వల్ల కూడా ఆస్తమా సమస్య వస్తుంది.
అస్తమా లక్షణాలేమిటి?
ఆస్తమాకు కారణం ఏదైనా సరే లక్షణాలు మాత్రం ఒకే తీరుగా ఉంటాయి. దగ్గు, పిల్లికూతలు (వీజింగ్), ఆయాసం, ఛాతీ టైట్‌గా ఉండటం ఆస్తమా లక్షణాలు. వీజింగ్ ఆస్తమా ప్రధాన లక్షణం. ఆస్తమా వల్ల లంగ్స్‌లో ఉండే వాయు నాళాలు (బ్రాంకైట్స్) కుంచించుకుపోతాయి. ఆస్తమా పెరుగుతున్న కొద్దీ టిష్యూస్‌లో వాపు వస్తుంది. కఫం తయారవుతుంది. దానిని బయటికి నెట్టడం కోసం దగ్గు వస్తుంది. ఆస్తమాతో బాధపడేవాళ్లు సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సమస్య ముదిరితే వాయు నాళాలకు (బ్రాంకైట్స్) ఆక్సిజన్ సరిగా అందదు. ఒక్కోసారి ప్రాణంపోయే ప్రమాదముంది.
ఎట్లా తగ్గుతుంది?
ఆస్తమా జీన్స్‌కు సంబంధించినదే. చిన్నప్పుడే (రెండేళ్లలోనే) బయటపడుతుంది. శరీరంలో సహజ మార్పుల వల్ల స్కూల్ ఏజ్‌లోనే ఎక్కువ మందిలో తగ్గుతుంది. బాడీ రియాక్ట్ కావడం నెమ్మదిగా తగ్గుతుంది. కొందరిలో వయసు పెరిగినా ఆస్తమా పోదు. ఆస్తమాను మందులతో కంట్రోల్ చేయొచ్చు. కానీ పూర్తిగా తగ్గించలేము.
ఆస్తమాతో బాధపడేవాళ్లలో ఇన్‌హేలర్స్ మూసుకుపోయిన వాయునాళాలను తెరుచుకునేలా (తాత్కాలికంగా) చేస్తాయి. మూసుకుపోయినట్లుగా మారిన వాయునాళాన్ని మందులతో మళ్లీ పూర్తిగా తెరుచుకునేలా చేయొచ్చు. ఆస్తమా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ వాడితే మామూలు స్థితికి వస్తుంది. చాలా ఏళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లలో వాయునాళం పూర్తిగా పూర్వ స్థితికి రాకపోవచ్చు. కానీ, కొంత మేరకు తెరుచుకునేలా చేస్తారు.
సీఓపీడీ ఆస్తమా తగ్గుతుందా?
ఇది చాలా కాలంగా స్మోకింగ్ చేసేవాళ్లకు వస్తుంది. పక్కన ఉండేవాళ్లు స్మోకింగ్ చేసినప్పుడు ఆ పొగ పీల్చే వాళ్లకూ వస్తుంది. ఇది కూడా సాధారణ ఆస్తమాలో వాయు నాళాలు కుంచించుకు (మూసుకు)పోయినట్లే అవుతుంది. దగ్గు, ఆయాసం వస్తుంది. సాధారణ ఆస్తమా వల్ల మూసుకుపోయిన వాయు నాళాలను పూర్వ స్థితికి తీసుకురావచ్చు. కానీ సీఓపీడీ ఆస్తమా బాధితుల్లో వాయు నాళాలను పూర్వ స్థితికి తీసుకురావడం సాధ్యం కాదు.
ఊపిరితిత్తులకు అలర్జీ రాకుండా ఉండాలంటే…
- అలర్జీకి కారణం ఏమిటో ముందుగా గుర్తించాలి. దానిని ఎప్పుడూ ఎవాయిడ్ చేయాలి.
- కొన్ని రకాల అలర్జీలను డీ సెన్సిటైజ్ చేయొచ్చు. అలా చేయాలంటే మందులు వాడుతూ డాక్టర్లు చెప్పినవి తింటూ, వాళ్లు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి.
- ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి.
- వయసు, ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
- హెల్దీగా ఉండేందుకు బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. బరువు పెరగకుండా ఉండే తిండి తినాలి.
- ఒబెసిటీ ఉంటే ఇతర సమస్యలు ఉంటాయి. వ్యాయామం చేస్తూ ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
- వ్యాయామం చేస్తూ, శారీరక శ్రమ ఉండే పనులు చేస్తూ శరీరాన్ని దృఢంగా ఉండేలా చూసుకోవాలి.
- కొన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వృద్ధులు, పిల్లలకు అవి అవసరాన్ని బట్టి ఇవ్వొచ్చు.
- టీబీ, న్యుమోనియా, ఫ్లూకి వ్యాక్సిన్లు తీసుకోవాలి.
- ఫ్లూకి ప్రతి ఏడాది వ్యాక్సిన్ తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న ముసలివారికి, ఆరు నెలల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వాలి.
- స్మోకింగ్ కారణం అయితే మానేయాలి. మానలేకపోతే డీ ఎడిక్షన్ మందులు వాడి అయినా సరే స్మోకింగ్ మానేయాలి.
వ్యవసాయ పనుల్లో ఉన్న ఆరోగ్యవంతుల ఊపిరితిత్తులకు కూడా అలర్జీ వస్తుంది. పొలంలో ఎరువులు చల్లుతున్నపుడు, పురుగు మందులు పిచికారీ చేస్తున్నప్పుడు అవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. పత్తి చేలల్లో పనిచేస్తున్నప్పుడు దూది రేణువులు గాలిలో కలుస్తుంది. దానిని
పీల్చితే ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ ఏర్పడుతుంది.