
- కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని కోడలిపై కక్ష
- గొడ్డలితో నరికి మర్డర్
- దహెగాం మండలం గెర్రెలో దారుణం
ఆసిఫాబాద్ / దహెగాం, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. నిండు గర్భిణి అయిన కోడలిని ఆమె మామే గొడ్డలితో నరికి హత్య చేశాడు. దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శివార్ల సత్తయ్య, సత్తెమ్మ దంపతుల రెండో కొడుకు శేఖర్ ఇంటర్ పూర్తి చేసి ట్రాలీ వెహికల్నడుపుతూ జీవిస్తున్నాడు. అతడి ఇంటి ఎదురుగా ఉండే తలండి లక్ష్మణ్, అనసూయ దంపతుల కూతురు శ్రావణి (21)తో ప్రేమలో పడ్డాడు.
వీరి ప్రేమను శేఖర్ ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో నిరుడు అక్టోబర్ 9న బెల్లంపల్లిలోని శివాలయంలో పెండ్లి చేసుకున్నారు. తర్వాత గ్రామానికి వచ్చి శ్రావణి వాళ్ల ఇంట్లోనే ఉంటున్నారు. ఇరు కుటుంబ సభ్యులవి ఎదురెదురు ఇండ్లు కావడంతో.. శేఖర్, శ్రావణి కనిపించిన ప్రతిసారి.. సత్తయ్య వారిని తిట్టేవాడు. తక్కువ కులానికి చెందిన శ్రావణి తన కొడుకు శేఖర్‌ను పెండ్లి చేకున్నదని, తన పరువు పోయిందని తీవ్ర ద్వేషం పెంచుకున్నాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని..
శ్రావణి తొమ్మిది నెలల గర్భిణి కావడం, శుక్రవారం నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు డెలివరీకి ఇంకా టైం ఉందని చెప్పడంతో ఇంటికి వచ్చేశారు. ఇదంతా గమనించిన సత్తయ్య.. కోడలు శ్రావణిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం శేఖర్, అతడి అత్తామామలు అనసూయ, లక్ష్మణ్ కట్టెల కోసం గ్రామ శివారులోకి వెళ్లారు. ఇంట్లో శ్రావణి ఒంటరిగా ఉండడం గమనించిన సత్తయ్య.. ఇంట్లోకి దూరి ఆమెపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె గాయాలతోనే కొంతదూరం పరుగెత్తి ఇంటి ఆవరణలో కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు శ్రావణి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, రూరల్ సీఐ కుమారస్వామి, దహెగాం పోలీసులు, పెంచికల్‌పేట ఎస్సై అనిల్ ఘటనాస్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదుతో సత్తయ్యతో పాటు అతడి పెద్దకొడుకు కుమార్, కోడలు కవితపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ కుమారస్వామి తెలిపారు.