- మంచిర్యాల ఎంసీహెచ్‌లో బాలింతల గోస
- బొంతలు కుట్టినట్లు కుట్లు వేస్తున్నారని ఆవేదన
- డ్రెస్సింగ్ చేయకపోవడంతో మానని గాయాలు
- డబుల్ కుట్లతో అవస్థలు పడుతున్న బాలింతలు
- కలెక్టరేట్లో కంప్లైంట్ చేసినా చర్యలు శూన్యం
మంచిర్యాల,వెలుగు: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, సాధారణ కాన్పులు చేయాలని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్తున్నా మంచిర్యాల ఎంసీహెచ్‌లో పరిస్థితి మారడం లేదు. ఎంసీహెచ్‌ను మెడికల్ కాలేజీ పరిధిలోకి తీసుకొచ్చినప్పటికీ అరకొర వైద్యమే అందుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా డాక్టర్లు, సిబ్బంది గర్భిణులు, బాలింతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సరైన వైద్యం చేయడం లేదని పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు. నార్మల్ డెలివరీ అవుతుందని రోజుల తరబడి వెయిట్ చేయిస్తున్నారని, సర్జరీలు చేసిన వాళ్లకు సరిగా కుట్లు వేయడం లేదని, డ్రెస్సింగ్ చేయడం లేదని చెప్తున్నారు. డాక్టర్లు, సిబ్బంది తీరుతో హాస్పిటల్లో తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. మంచిర్యాల గోదావరి రోడ్డులో రూ.17 కోట్లతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)ను నిర్మించారు. మార్చిలో మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. రెండు నెలల కిందట ఎంసీహెచ్‌ను జిల్లా హాస్పిటల్ నుంచి కొత్త బిల్డింగ్‌లోకి షిఫ్ట్ చేశారు. ఇక గర్భిణులు, బాలింతలు, పిల్లలకు మెరుగైన వైద్యం అందుతుందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి ఏమీ మారలేదు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంగా వైద్యం అందిస్తున్నారు. సర్జరీలు చేసిన తర్వాత కుట్లు సరిగా వేయడం లేదు. నర్సింగ్ స్టాఫ్ కనీసం డ్రెస్సింగ్ కూడా చేయడం లేదు. దీంతో చాలామందికి కుట్లు ఆరక గాయాలు మానడం లేదు. కొందరికి చీము వచ్చి కుట్లు పికిలిపోయి పండ్లు అవుతున్నాయి. ఇటీవల ఓ మహిళకు సర్జరీ చేసిన తర్వాత మూడు రోజులకే కుట్లు పికిలిపోయి పుండు కావడంతో ఆమెను కరీంనగర్ ఎంసీహెచ్‌కు తరలించారు. మరికొందరికి ఎనిమిది రోజుల తర్వాత మరోసారి కుట్లు వేస్తున్నారు. రెండుసార్లు కుట్లు వేయడంతో బాలింతలు నొప్పులతో అవస్థలు పడుతున్నారు. సర్జరీ తర్వాత వారం రోజులకు పేషెంట్లను డిశ్చార్జి చేయాలి. కానీ సరైన వైద్యం అందకపోవడంతో పదిహేను ఇరవై రోజుల దాకా హాస్పిటల్లో ఉండాల్సి వస్తోంది.
పిల్లలకు అందని మెరుగైన వైద్యం...
ఎంసీహెచ్‌లో పిల్లల వైద్యులు సరిపడా లేకపోవడంతో నవజాత శిశువులకు మెరుగైన వైద్యం అందడం లేదు. దీంతో అత్యవసర సమయాల్లో శిశువులను కరీంనగర్ ఎంసీహెచ్‌కు రెఫర్ చేస్తున్నారు. బాలింతలను ఇక్కడ వదిలేసి పిల్లలను అంతదూరం తీసుకెళ్లలేక చాలా మంది జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నారు.
కనీస సౌలత్లు కరువు...
ఆధునిక సౌకర్యాలతో ఎంసీహెచ్‌ను నిర్మించామని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. వార్డుల్లో తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో రూ.50 పెట్టి రోజుకో కూల్ క్యాన్ కొనుక్కుంటున్నారు. వార్డుల్లో సీలింగ్ ఫ్యాన్లు చాలా ఎత్తున ఉండడంతో సరిగా గాలి రావడం లేదు. ఉక్కపోత భరించలేక పలువురు ఇండ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు, కూలర్లు తెచ్చి పెట్టుకుంటున్నారు. ఓపీ కౌంటర్ దగ్గర, వెయిటింగ్ ఏరియాల్లో ఫ్యాన్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంసీహెచ్‌లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. 40 మందికి పైగా సిబ్బంది పనిచేయాల్సిన చోట కేవలం ఎనిమిది మందే ఉన్నారు. దీంతో హాస్పిటల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయి కనిపిస్తోంది. వార్డుల్లో చెత్త వేయడానికి సరిపడా డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేయలేదు. టాయ్లెట్లలో సరిగా నీళ్లు రాకపోవడం, ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి.
పైసలు వసూల్...
ఎంసీహెచ్‌లో పనిచేసే కొంతమంది సిబ్బంది పేషెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సర్జరీకి రూ.500 నుంచి రూ.1000, నార్మల్ డెలివరీకి రూ.500 వరకు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. హాస్పిటల్‌లోని సమస్యలపై కొంతమంది బాలింతల కుటుంబీకులు ఈ నెల 22న కలెక్టరేట్లో కంప్లైంట్ చేశారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లిందో లేదో... కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు.
