- సామాజికవర్గాల వారీగా ఆశావహుల జాబితా సిద్ధం చేయాలి
- రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను నిలపాలి
- డీసీసీలకు సూచించిన పీసీసీ నాయకత్వం
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో మెజార్టీ మున్సిపాలిటీలను స్వాధీనం చేసుకునేందుకు పీసీసీ కసరత్తు ప్రారంభించింది. ప్రతి మున్సిపాలిటీలోని డివిజన్లలో కౌన్సిలర్, కార్పొరేటర్ లుగా పార్టీ టికెట్ పై పోటీ చేసేందుకు అర్హులైన కార్యకర్తలు, నేతల జాబితాలను సిద్ధం చేయాలని డీసీసీలకు పీసీసీ నాయకత్వం ఆదేశాలిచ్చింది.
రిజర్వేషన్లకు అనుగుణంగా అక్కడి అభ్యర్థులను నిలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వార్డుల వారీగా ఒక్కో సామాజికవర్గం నుంచి మూడుకు తగ్గకుండా పేర్లను సిద్ధం చేసేందుకు టౌన్, సిటీ కాంగ్రెస్ కమిటీలను అప్రమత్తం చేయాలని డీసీసీలను పీసీసీ నాయకత్వం ఆదేశించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు అనుసరించాల్సి వ్యూహాలు, టికెట్లు ఎవరికి ఇస్తే గెలుస్తారనే దానిపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి రాష్ట్ర నాయకత్వానికి పంపించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీలను రాష్ట్ర నేతలు ఆదేశించారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలో ఊపుతో...
పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇప్పుడు అత్యధిక మున్సిపాలిటీలను చేజిక్కించుకోవడంపై పీసీసీ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నది. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున, పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా బీసీలను ఆ పార్టీ బరిలో నిలిపింది.
దీన్ని పరిగణనలోకి తీసుకొని 42 శాతం బీసీ రిజర్వేషన్లను పార్టీపరంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నది. దీంతో ప్రతి వార్డులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, మహిళా వర్గాల నుంచి పార్టీ తరఫున టికెట్ ఆశావహుల పేర్లను సిద్ధం చేసుకోవాలని డీసీసీలకు రాష్ట్ర పార్టీ సూచించింది.
కష్టపడిన వారిని గుర్తించి టికెట్లు ఇవ్వాలి
పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు దక్కనివారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీని నమ్ముకొని కష్టపడ్డ వారిని గుర్తించాలని పీసీసీ సూచించింది. పార్టీ విధేయులకు ఆయా డివిజన్లలో కేటాయించే రిజర్వేషన్లకు అనుగుణంగా టికెట్లు ఇచ్చేందుకు స్థానిక కమిటీలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగాలని కూడా ఆదేశించింది.
ఇక పాత.. కొత్త నేతలను కలుపుకొని సమన్వయంతో ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు కొత్త వారికి కూడా కనీసం 20 శాతం వరకు టికెట్లు ఇవ్వనున్నట్లు లోకల్ కమిటీలకు సంకేతాలు ఇవ్వాలని డీసీసీలను పీసీసీ ఆదేశించింది. దీంతో కొత్త వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అందుకే ఇప్పటి నుంచే అలాంటి వారిపై దృష్టి పెట్టి జాబితాలను రెడీ చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది.
