- దీనిపై సీఎంను కోరుతా, ఇందుకోసం మంత్రి పదవి వదులుకుంటా: వాకిటి శ్రీహరి
- ముదిరాజ్ సర్పంచ్‌లను సన్మానించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర ఎంతో కీలకమని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజకీయాల్లో ఎంతో మంది ప్రజా ప్రతినిధులు ఉన్నా కేవలం సర్పంచ్ లకు మాత్రమే రాజ్యాంగం చెక్ పవర్ ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో సర్పంచ్ లుగా గెలిచిన ముదిరాజ్ లను మంగళవారం రవీంద్రభారతిలో మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు సర్పంచులుగా గెలిచిన వారందరూ భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పండుగ సాయన్న స్ఫూర్తితో, కానిస్టేబుల్ ఉద్యమ స్ఫూర్తితో, మహాత్మా జ్యోతిరావ్ పూలే ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఇచ్చిన వాటాతో రాజకీయంగా ముదిరాజ్‌లు ఎదగాలని కోరారు.
బీసీల్లో ముదిరాజ్‌ల జనాభా ఎక్కువ
రాష్ట్రంలోని బీసీల్లో ఎక్కువ జనాభా ముదిరాజ్ లదే అని, అసెంబ్లీ, పార్లమెంట్ లో ముదిరాజ్ ల ప్రాతినిధ్యం పెరగాలని మంత్రి వాకిటి ఆకాంక్షించారు. “మంత్రి పదవి కావాలా లేక ముదిరాజ్ లను బీసీ ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’ చేర్చాలా అని అడిగితే క్షణం ఆలోచించకుండా మంత్రి పదవి వదులుకుంటాను. బీసీ బిడ్డగా మంత్రిగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతూనే నా జాతి కోసం ఆలోచిస్తాను.
మంత్రిగా ముదిరాజ్ బిడ్డగా ముదిరాజ్‌లను బీసీ ‘ఏ’ లో చేర్చేలా సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పిస్తాను. త్వరలోనే ముదిరాజ్‌ల ఐకత్య చాటేందుకు పరేడ్ గ్రౌండ్లో సభ ఏర్పాటు చేయాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ సామాజికవర్గ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
