వ్యాక్సిన్ తీసుకున్నా జాగ్రత్తలు తప్పనిసరి

వ్యాక్సిన్ తీసుకున్నా జాగ్రత్తలు తప్పనిసరి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. గుజరాత్‌‌లోని రాజ్‌‌కోట్‌‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ వర్చువల్‌‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్ గురించి ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని, నూతన ఏడాది వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ చేయించుకున్నా మాస్కులు కట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ లాంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం. 2020 నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఈ ఏడాది సవాళ్లతో కూడుకున్నది. అలాగే సాగింది కూడా. ప్రపంచ ఆరోగ్య కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. 2021లో భారత్‌‌ను హెల్త్‌‌కేర్ సెక్టార్‌‌లో మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నాం. మందు లేదు కాబట్టి అలసత్వం వద్దని ఇంతకుముందు చెప్పా. కానీ మందులతోపాటు జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు సూచిస్తున్నా. ఇదే మన నినాదం కావాలి. మన దేశంలో రూమర్లు త్వరగా వ్యాప్తి అవుతాయి. వ్యాక్సినేషన్ మొదలైనప్పుడు కూడా ఏవేవో పుకార్లు వస్తాయి. దీని గురించి ఇప్పటికే కొన్ని రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. కరోనాతో పోరాడటమంటే కనిపించని శత్రువుతో కొట్లాడటమే. అలాంటి రూమర్లతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నా’ అని మోడీ పేర్కొన్నారు.