నాటి టెర్రరిస్టు కొడుకే నేడు పాక్ ఆర్మీ ప్రతినిధి

నాటి టెర్రరిస్టు కొడుకే  నేడు పాక్ ఆర్మీ ప్రతినిధి
  • పాక్ సైన్యంలో  టెర్రరిజం మూలాలు వెలుగులోకి
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న అంతర్జాతీయ సమాజం

న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌‌‌‌‌‌‌‌పీఆర్) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేస్తున్న అహ్మద్ షరీఫ్ చౌదరి.. కరుడుగట్టిన టెర్రరిస్ట్ సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ కొడుకని తేలింది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ సైనిక నాయకత్వంలో ఉగ్రవాద సంబంధాలు తీవ్ర చర్చకు దారితీశాయి.

 ఓ టెర్రరిస్ట్ కొడుకును పాక్ ఆర్మీ ప్రతినిధిగా నియమించడంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్‌‌‌‌‌‌‌‌సీ) నివేదిక ప్రకారం..సుల్తాన్ బషీరుద్దీన్ మహమూద్ న్యూక్లియర్ విభాగంలో సైంటిస్టుగా పనిచేశాడు. ఆ తర్వాత అతను టెర్రరిజం వైపు ఆకర్షితుడయ్యాడు.

 ఉమ్మా తమీర్ ఇ-నౌ (యూటీఎన్) అనే సంస్థను స్థాపించి ఆల్-ఖైదా, తాలిబాన్‌‌‌‌‌‌‌‌లకు రసాయన, జీవ, అణు ఆయుధాలకు సంబంధించిన సమాచారం అందించాడు. ఒక సందర్భంలో  ఆల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌‌‌‌‌‌‌‌ను కూడా కలిసి.. అణు ఆయుధాల తయారీకి సంబంధించిన సమాచారం ఇచ్చాడు. అతనికి సుల్తాన్ బషీరుద్దీన్ సహాయకుడిగా కూడా పనిచేశాడు. 

సుల్తాన్ బషీరుద్దీన్  ఉగ్రవాద కార్యకలాపాలు పశ్చిమ దేశాలను, ముఖ్యంగా అమెరికాను భయాందోళనకు గురిచేశాయి. దాంతో అమెరికా 2001 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో అతడిని టెర్రరిస్టుగా ప్రకటించింది. యూఎన్ఎస్‌‌‌‌‌‌‌‌సీ కూడా  సుల్తాన్ బషీరుద్దీన్  ఉగ్రవాదిగా నమోదు చేసింది. అనంతరం అమెరికా అతడిని అరెస్ట్ చేసింది. ఎఫ్‌‌‌‌‌‌‌‌బీఐ విచారణలో తాను ఒసామాను కలిసినట్లు  సుల్తాన్ బషీరుద్దీన్ అంగీకరించాడు. 

ఇలాంటి చరిత్ర కలిగిన అహ్మద్ షరీఫ్ చౌదరి..ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యంలో అత్యున్నత స్థానంలో ఉంటూ భారత్ పై నిత్యం విషం కక్కుతున్నాడు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను ఉగ్రవాద బాధిత దేశంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, అతని తండ్రి ఉగ్రవాద చరిత్ర.. పాక్ సైన్యంలో టెర్రరిజం సంబంధాలపై తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.