ఇండియా కూటమితోనే ప్రజాస్వామ్య పరిరక్షణ : ప్రొఫెసర్​ కోదండరాం

ఇండియా కూటమితోనే ప్రజాస్వామ్య పరిరక్షణ :  ప్రొఫెసర్​ కోదండరాం

పెద్దపల్లి, వెలుగు :  ఇండియా కూటమితోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మార్పును కోరుతూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు,  ప్రొఫెసర్​ కోదండరాం అన్నారు.  పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పీపుల్స్ వాయిస్ ఆధ్వర్యంలో మంగళవారం   ఏర్పాటు చేసిన ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ ఎన్నికలు– మన కర్తవ్యం' అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ,  దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఈడీ, సీబీఐలను రాజకీయ నాయకులను లొంగదీసుకోవడానికి ఉపయోగిస్తున్నారన్నారు. దేశంలో పదేండ్లలో 160 మంది బిలియనీర్లుగా ఎదిగారన్నారు. 

వారంతా దేశంలోని 25శాతం జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తున్నారన్నారు. దేశంలోని సంపద దాదాపు 40 శాతం ఇలాంటి వారి చేతిలోనే  ఉందన్నారు. బీజేపీ లాంటి ప్రభుత్వాలు  ఏర్పడితే సమానత్వం దెబ్బతినడంతో పాటు ప్రజాస్వామ్యం ప్రమాదంలో  పడిపోతుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో  బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమిని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడానికి,  ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, భారతదేశంలో పెరుగుతున్న అసమానతలను రూపుమాపడానికి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. ఓయూ జేఏసీ లీడర్లు కోట శ్రీనివాస్, సీనియర్​ జర్నలిస్టు మునీర్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, జీవన్​రాజ్​, డొంకెన రవి, శ్రీమాన్​, ధనుంజయ్, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.