హైదరాబాద్: బీసీలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా బీసీ రాజ్యాధికార సమితిని ఏర్పాటు చేసినట్లు ఆ సమితికి అధ్యక్షుడిగా ఎన్నికైన దాసు సురేశ్ తెలిపారు. బాగ్ లింగంపల్లి అపూర్వ ఎంక్లేవ్ లో జరిగిన సమితి ఏర్పాటు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్, నారగోని, సూర్య రావు, విఠల్, దొంతు ఆనందం, కృష్ణలత, జేపీ భారత్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా కలిసి బీసీ రాజ్యాధికార సమితిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన దాసు సురేశ్ మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఏ ఒక్క బీసీ వ్యక్తి సీఎం కాలేదన్నారు.
బీసీలను కేవలం ఓటు వేసే యంత్రాలుగానే రాజకీయ పార్టీలు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు బీసీలు అన్ని పార్టీలకు సేవ చేశారన్న ఆయన... ఇక నుంచి బీసీ సమితి కోసం వారంతా పని చేస్తారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో బీసీలను ఏకం చేస్తామన్నారు. బీసీల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రణాళికా రూపొందిస్తున్నామన్న ఆయన... బీసీలు ముఖ్యమంత్రి అయ్యేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
