
- ప్రదానం చేసిన ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్'ను అందుకున్నారు. ఫిజీ దేశ పర్యటనలో ఉన్న రాష్ట్రపతికి మంగళవారం ఆ దేశ ప్రెసిడెంట్ రతు విలియమ్ మైవలిలీ కటోనివెరే ఈ పుసర్కారాన్ని అందజేసినట్టు రాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం భారతదేశం, ఫిజీ మధ్య ఉన్న లోతైన స్నేహ సంబంధాలకు ప్రతిబింబమని ఆమె పేర్కొన్నారు. అలాగే, రెండు దేశాల మధ్య సంబంధాలను కొనియాడారు.
అంతేకాకుండా ఫిజీని బలమైన, మరింత సంపన్నమైన దేశంగా నిర్మించడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీని అందుకున్న రాష్ట్రపతికి అభినందనలు. ఇది ప్రతి భారతీయునికి అపారమైన గర్వం, సంతోషకరమైన క్షణం. ఇది రాష్ట్రపతి నాయకత్వానికి గుర్తింపు, అలాగే భారతదేశం, ఫిజీ -ప్రజల మధ్య ఉన్న సంబంధానికి చారిత్రక గుర్తింపు’’ అని ప్రధాని ట్వీట్చేశారు.