టెండర్లు, కాంట్రాక్టుల లెక్కలేంటి.? HCA స్కాంలో కొనసాగుతోన్న విచారణ

టెండర్లు, కాంట్రాక్టుల లెక్కలేంటి.? HCA  స్కాంలో కొనసాగుతోన్న విచారణ
  • హెచ్‌‌‌‌సీఏ అధ్యక్షుడు జగన్‌‌‌‌మోహన్‌‌‌‌రావు, ట్రెజరర్, సీఈవోకు సీఐడీ ప్రశ్నలు
  • క్యాటరింగ్‌‌‌‌, ప్లేయర్ల ట్రావెలింగ్‌‌‌‌, హోటల్ బుకింగ్స్‌‌‌‌పై  ఆరా
  • ఈవెంట్స్ నౌ యాప్‌‌‌‌లో ఐపీఎల్‌‌‌‌ టికెట్ల విక్రయాలపైనా ఎంక్వైరీ
  • ఉప్పల్​ స్టేడియంలో మూడో రోజు కొనసాగిన విచారణ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ) అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్‌‌‌‌మోహన్‌‌‌‌ రావు సీఐడీ కస్టడీ కొనసాగుతున్నది. మూడోరోజు కస్టడీలో భాగంగా సీఐడీ అధికారులు స్టేడియంలో కాంట్రాక్టులపై దృష్టి పెట్టారు. ప్రధానంగా క్యాటరింగ్‌‌‌‌, ప్లేయర్లను తరలించేందుకు ట్రావెల్స్, హోటల్‌‌‌‌ బుకింగ్స్‌‌‌‌ సహా  ఇతర టెండర్లపై ఆరా తీశారు. ఇందుకోసం జగన్‌‌‌‌ మోహన్‌‌‌‌రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటెను  శనివారం మరోసారి ఉప్పల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ స్టేడియంకు తరలించారు. హెచ్‌‌‌‌సీఏ కార్యాలయంలో ఎంక్వైరీ చేశారు. 2023–-24, 2024-–25లో ఐపీఎల్‌‌‌‌ 17, 18 ఎడిషన్స్‌‌‌‌ నిర్వహణకు సంబంధించిన పలు టెండర్ల కేటాయింపు, అందులో నిబంధనల అతిక్రమణపై మరింత లోతుగా ప్రశ్నించినట్టు తెలిసింది.  ప్రధానంగా ఈ రెండు సీజన్ల సమయంలో ఫుడ్‌‌‌‌, ట్రావెల్స్‌‌‌‌ కాంట్రాక్టుల అప్పగింత, హోటల్‌‌‌‌ బుకింగ్స్‌‌‌‌లో నిబంధనలు అతిక్రమించి ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది, ఈ- టెండర్ల విధానంలో కాకుండా కొందరికి అప్పగించినట్టు వచ్చిన ఆరోపణలపైనా ప్రశ్నించినట్టు సమాచారం.

విడివిడిగా ఎంక్వైరీ..

జగన్‌‌‌‌మోహన్‌‌‌‌రావుతోపాటు హెచ్‌‌‌‌సీఏ ట్రెజరర్‌‌‌‌  శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కాంటెను సైతం ఉప్పల్ స్టేడియానికి తీసుకెళ్లిన సీఐడీ అధికారులు.. టెండర్ల వ్యవహారంపై వివరాలు సేకరించారు.  ఐపీఎల్‌‌‌‌ టికెట్ల విక్రయానికి సంబంధించిన కాంట్రాక్టులు మాజీ మంత్రి  కేటీఆర్‌‌‌‌ బావమరిది రాజ్‌‌‌‌ పాకాలకు చెందిన ఈవెంట్స్‌‌‌‌నౌ.కామ్‌‌‌‌, మేరా ఈవెంట్‌‌‌‌.కామ్‌‌‌‌ సహా పలు కంపెనీలకు అప్పగించారని  తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌‌‌‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు వివరాలు రాబడుతున్నారు.  ఇందుకు సంబంధించి జగన్‌‌‌‌మోహన్‌‌‌‌రావు, శ్రీనివాసరావు, సునీల్‌‌‌‌ కాంటెను విడివిడిగా ప్రశ్నించారు.  దేశవాళీ క్రికెట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ నిర్వహణకు బీసీసీఐ నుంచి వచ్చే నిధులతోపాటు ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల నుంచి వాటాగా వచ్చే మొత్తాలను పక్కదారి పట్టించినట్టు వచ్చిన ఆరోపణలపైనా సీఐడీ అధికారులు ఆరా తీశారు.

మరిన్ని వార్తలు