
పార్లమెంట్ రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినందించారు రామ్ నాథ్ కోవింద్.
భారత ఉగ్రపోరులో ప్రపంచం మద్దతు
ఉగ్రవాదంపై ప్రపంచమంతా భారత్ వెంటే ఉందన్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గుర్తించేట్టు చేయగలిగామని చెప్పారు. సాయుధ దళాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. త్వరలోనే సైన్యానికి రాఫెల్ యుద్ధ విమానాలు, అపాచీ హెలికాప్టర్లు అందుతాయన్నారు. అలాగే రిటైర్డ్ సైనికుల కోసం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేస్తున్నామని చెప్పారు.
సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ నినాదంతో కేంద్రప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు రాష్ట్రపతి. జన్ ధన్ యోజన సక్సెస్ తో బ్యాంకింగ్ సేవలను ప్రజల ఇంటి దగ్గరకు తీసుకెళ్లేందుకు పని చేస్తున్నామన్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా కూడా బ్యాంకింగ్ సేవలను కల్పిస్తామన్నారు కోవింద్.
అవినీతిని మా ప్రభుత్వం సహించదు
అవినీతిని ప్రభుత్వం సహించదన్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. ఆర్థిక నేరాలు చేసి విదేశాలకు పారిపోయేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఫ్యూజిటివ్ అండ్ ఎకనమిక్ అఫెండర్స్ చట్టం తీసుకొచ్చామన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ చట్టం, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్సీ కోడ్ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుడికి అందించేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు.
విద్యావిధానంపై ప్రత్యేక దృష్టి
విద్యా విధానంపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు రాష్ట్రపతి కోవింద్. ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రపంచంలోని టాప్ 500 విద్యా సంస్థల్లో భారత విద్యా సంస్థలు చోటు దక్కించునేలా ఎంకరేజ్ చేస్తామన్నారు. 2 కోట్ల అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు.
జీఎస్టీని సులభతరం చేస్తున్నాం
GSTని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతాయన్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. చిన్న వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని వారికి కొత్త ఫించన్ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. అలాగే నేషనల్ ట్రేడర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేస్తామన్నారు. నేషనల్ రీటెయిల్ ట్రేడ్ పాలసీ కూడా తీసుకొస్తామన్నారు. GSTలో రిజిస్టర్ అయిన వ్యాపారులకు 10లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని కోవింద్ చెప్పారు.
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యత
మహిళా సాధికారత ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా చెప్పారు రాష్ట్రపతి కోవింద్. మహిళల అభివృద్ధి, మహిళల నేతృత్వంలో అభివృద్ధి కి ప్రాధాన్యమిస్తామన్నారు. మహిళల భద్రతకు ప్రభావవంతమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు అమలు చేస్తున్నామన్నారు.
స్టార్టప్ లకు ప్రోత్సాహం
అతి ఎక్కువ స్టార్టప్స్ ఉన్న దేశాల్లో ఒకటిగా భారత్ ఉందన్నారు రాష్ట్రపతి కోవింద్. స్టార్టప్ లను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిబంధనలను సరళీకృతం చేస్తోందని చెప్పారు. 2024 నాటికి 50వేల స్టార్టప్స్ లక్ష్యంగా పెట్టుకున్నామని కోవింద్ చెప్పారు.
అందరికీ ఆరోగ్యం
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇప్పటివరకు 26లక్షల మంది రోగులకు వైద్యం అందిందన్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. 50 కోట్ల మంది పేదలకు వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకొచ్చామన్నారు. 2022 వరకు గ్రామీణ ప్రాంతాల్లో లక్షన్నర హెల్త్ అండ్ వెల్ నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని… ఇప్పటికే 18వేల కేంద్రాలు పనిచేస్తున్నాయని చెప్పారు.
ప్రపంచ క్రీడల పవర్ హౌజ్ భారత్
దేశంలో క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ను మరింత విస్తృతంగా అమలు చేస్తామన్నారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మౌళిక వసతులు కల్పిస్తామన్నారు. ప్రపంచ క్రీడల్లో భారత్ ను పవర్ హౌస్ గా నిలబెట్టేందుకు చర్యలు ప్రారంభించామని కోవింద్ చెప్పారు.