కొలంబో : శ్రీలంక ప్రెసిడెంట్ ఎలక్షన్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస మంగళవారం ప్రకటించారు. శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ‘సమగి జన బలవెగయ’ నేత సజిత్ ప్రేమదాస తప్పుకోవడంతో అధ్యక్ష ఎన్నికల బరిలో ముగ్గురు సభ్యులే మిగిలారు. అధికార పార్టీ తరఫున విక్రమ సింఘే, మాజీ విద్యాశాఖ మంత్రి దుల్లాస్ అలహపెరుమ, వామపక్ష పార్టీ లీడర్ అనుర కుమార దిసనాయకెలు బరిలో ఉన్నారు. తమ పార్టీ దుల్లాస్ అలహపెరుమకే మద్దతు ఇస్తుందని ప్రేమదాస ట్వీట్ చేశారు. ‘నేను ప్రేమించే నా దేశం, నేను ఆరాధించే ప్రజల గొప్ప ప్రయోజనాల కోసమే పోటీ నుంచి తప్పుకుంటున్నాను’ అని సజిత్ ప్రేమదాస ప్రకటించారు. ‘విక్రమ సింఘేకు అధికారం దక్కకుండా.. దుల్లాస్తో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమిగా ఏర్పడి విక్రమ సింఘేను ఓడిస్తాం’ అని సజిత్ ప్రేమదాస ప్రకటించారు.
