మోడల్ ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులు ఇక మల్టీజోన్!

మోడల్ ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులు ఇక మల్టీజోన్!
  • త్వరలోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు ఉత్తర్వులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ –2018 ప్రకారం టీచింగ్ పోస్టుల కేడర్ స్థాయిల్లో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ప్రిన్సిపల్ పోస్టు మాత్రమే స్టేట్ లెవెల్ పోస్టు ఉండగా, పీజీటీ, టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా ఉన్నాయి. అయితే, రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తే ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులు మల్టీజోనల్ పోస్టులుగా, టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా మారనున్నాయి. దాదాపు విద్యాశాఖలోని అన్ని విభాగాల్లో ఇప్పటికే మార్పులు కాగా, మోడల్ స్కూల్​లోనూ దీన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. దీని అమలు కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.

అయితే, చాలా ఏండ్ల తర్వాత మోడల్ స్కూల్ టీచింగ్ సిబ్బందికి ఇటీవలే బదిలీలు నిర్వహించారు. తాజాగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉత్తర్వులు వచ్చాకా.. జీవో 317 అమలు చేయనున్నారు. సొంత మల్టీజోన్, జోనల్​  పరిధిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటే.. వారిని వారి ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. కాగా..రాష్ట్రంలో 194  మోడల్ స్కూళ్లుండగా వాటిలో 3,880 శాంక్షన్ పోస్టులున్నాయి. వీటిలో 2,808 మంది పనిచేస్తుండగా, 1072 ఖాళీగా ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులు 194లో 99 మంది పనిచేస్తుండగా, 95 వెకెంట్ ఉన్నాయి. పీజీటీలో 2,522 శాంక్షన్ పోస్టులు ఉండగా.. 1956 మంది పనిచేస్తున్నారు. టీజీటీ పోస్టులు 1164 శాంక్షన్  ఉండగా, 753 మంది పనిచేస్తున్నారు.