
- లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50 వేల ఎకరాలకూ నీళ్లు ఇయ్యలే: సీఎం రేవంత్
- నేతల మాటలు విని తప్పు చేస్తే అధికారులకు ఊచలు తప్పవ్
- 75% పూర్తయిన ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తం
- ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, పాలమూరు ప్రాజెక్టులకు ప్రాధాన్యం
- గ్రూప్-1 కొలువుల్లోనూ రాద్ధాంతం
- గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు పూర్తి చేస్తం
- 443 మంది ఇంజినీర్ లు, జేటీవోలకు నియామకపత్రాలు అందజేసిన సీఎం
- డెడికేషన్‌తో పని చేయాలని.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగం కావాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజినీరింగ్ వైఫల్యమని, అది పూర్తిగా కుప్పకూలిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా ఆ ప్రాజెక్టుతో కనీసం 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని దుస్థితి ఉందన్నారు. గత పాలకులు ముడుపుల మాయాజాలంతో నాసిరకంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మూడేళ్లలోనే కుప్పకూలడం సిగ్గుచేటన్నారు. ఇంజినీర్లు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్ వంటి పాతతరం ప్రాజెక్టులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
రాజకీయ నాయకుల మాటలు విని తప్పులు చేస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గ్రూప్-1 ఉద్యోగాల నియామకాల్లోనూ రాద్ధాంతం చేస్తున్నారని, రాజకీయ ప్రేరేపిత పిటిషన్లతో అడ్డుకునే కుట్ర జరుగుతోందని సీఎం ఆరోపించారు. బుధవారం జలసౌధలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 244 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(ఏఈఈ), 199 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్(జేటీవో)లకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నవారు.. తమ ఉద్యోగాన్ని నెలనెలా జీతం తీసుకునే యథాలాప బాధ్యతగా భావించకుండా రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.
సాయిల్ టెస్ట్ చేయకుండనే ప్రాజెక్టు..
గత పాలకులు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసినా ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సరైన ప్రణాళిక లేదని, కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయకుండా హెలికాప్టర్‌లో చూసి బ్రిడ్జిలు, బ్యారేజీలు కట్టారని ఎద్దేవా చేశారు. ఇంజినీర్లు తమ పని తాము చేయాలని, రాజకీయ నాయకుల జోక్యంతో తప్పులు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
‘‘రాజకీయ నాయకులు చెప్పిందల్లా చేస్తే.. తర్వాత ఊచలు లెక్కపెట్టాల్సింది మీరే. ఎందుకంటే ఈరోజు వచ్చిన విచారణలు, నిన్న మొన్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలు గానీ ఇవన్నీ చూస్తే మొత్తం అధికారుల పేర్ల మీద రాసిపెట్టారు. ఇచ్చిన ఆదేశాలు ప్రజా ప్రతినిధులకు సంబంధించినవి. అమలు చేసింది అధికారులు. అందుకే మొత్తం అధికారులను ఉరితీయాలన్న విధంగా ఈరోజు ఆ నివేదికలు వచ్చాయి. గుడ్డిగా చెప్పిందల్లా చేస్తే ఏం జరుగుతుందో కాళేశ్వరం ప్రాజెక్టే ఒక ఉదాహరణ” అని సీఎం చెప్పారు.
ఇంజినీర్ల పని ఇంజినీర్లే చేయాలి..
ఇంజనీర్లలో ఏ విభాగానికి చెందినవారు అవే పనులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘స్ట్రక్చర్ ఇంజినీర్ ఏం పని చేయాలి, సీసీడీవో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుంచి ఇంజినీర్లు ఏం పని చేయాలి, ప్రాజెక్టులో సూపర్‌వైజ్ చేసే వాళ్లు ఏం చేయాలి, ఎవరు ఏం పని చేయాల్నో అదే పని చేయాలి’’ అని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.47 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టి రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారన్నారు. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు రూ.1,0-15 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు.
హెలికాప్టర్ లో చూసి ప్రాజెక్టులు కట్టారని, ఇంజినీర్ల పని ఇంజినీర్లే చేయాలి కానీ రాజకీయ నాయకులు జోక్యం చేసుకోరాదన్నారు. కనీసం 30 ఏళ్ళ అనుభవం కూడా లేకున్నా గాలి మోటార్లో తిరుగుతూ ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. సీతారామ సాగర్ పిల్లర్స్ కూలిపోయినట్లుగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, హంద్రీ నీవా, సీతారామ, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం, సమ్మక్క సారక్క, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. 40, 50 ఏండ్లుగా తెలంగాణ ప్రాంతానికి రావలసిన నీళ్లు రాకపోవడం, ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల అన్యాయం జరిగిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
పాత ప్రాజెక్టులే ఆదర్శం..
కొత్తగా విధుల్లో చేరబోతున్న ఇంజినీర్లు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్ వంటి పాత ప్రాజెక్టులను సందర్శించి వాటి నిర్మాణ శైలిని అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కాళేశ్వరం వంటి లోపభూయిష్టమైన ప్రాజెక్టులను ఎలా నిర్మించకూడదో తెలుసుకోవాలన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు నిలిచిపోవడం వల్ల 8 మంది చనిపోయారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల ప్రాధాన్యతల వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో ఎస్ఎల్‌బీసీ, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, సీతారామసాగర్ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 14 నెలల్లో 1,161 మంది ఇంజినీర్లకు, 2,000 మంది లష్కర్లకు నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 75 శాతం పూర్తయిన ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేస్తామని, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని సీఎం చెప్పారు. భాక్రానంగల్ డ్యామ్, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు జవహర్ లాల్ నెహ్రూ పునాదులు వేశారని వివరించారు. నిజాం సర్కార్ కట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మూసీ నది డిజైన్లు 100 ఏండ్లయినా చెక్కు చెదరలేదని, 2009లో వరదలు వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కూడా తట్టుకుని నిలబడిందన్నారు. నల్గొండలో 3 లక్షల 60 వేల ఎకరాలకు నీళ్ళిచ్చే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ఇప్పుడు తమ ప్రభుత్వం సాగునీటికి ఖర్చు పెడదామంటే నిధుల కొరత ఉందన్నారు.
‘గ్రూప్ 1’ సమస్యను అధిగమిస్తాం..
గ్రూప్-1 నియామకాలపై కొందరు రాజకీయ నాయకుల ప్రేరేపణతో కోర్టుకు వెళ్లడం దురదృష్టకరమని సీఎం అన్నారు. ‘‘563 మంది గ్రూప్-1 ఉద్యోగులకు ఈరోజు నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది. కానీ కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్లు హైకోర్టులో వేసి ఉద్యోగ నియామకాలను అడ్డుకుంటున్నారు. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి నియామకాలు చేపడితే.. ఆ తర్వాత 15 ఏండ్లు గ్రూప్-1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మేం వచ్చిన తర్వాత పకడ్బందీగా 563 మంది గ్రూప్-1 ఆఫీసర్లను ఇవ్వడానికి ప్రక్రియ మొత్తం పూర్తయింది.
కేవలం ఒక ఇనెలిజిబుల్ పర్సన్ పోయి ఈరోజు అక్కడ కోర్టులో స్టే తెచ్చుకుని 563 గ్రూప్-1 ఉద్యోగాలను అడ్డుకుంటున్నారు. దీని వెనకాల రాజకీయ పార్టీలు, నాయకులు ఎవరున్నారో మాకు తెలుసు. తొందరలోనే ఆ సమస్యను కూడా అధిగమించి గ్రూప్-1తోపాటు గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 అన్ని నియామకాలను పూర్తి చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.