‘పాలమూరు’ ప్రాజెక్ట్‌‌ ను బీఆర్‌‌ఎస్‌‌ పట్టించుకోలే..ఈ ప్రాజెక్ట్‌‌ ను కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేస్తుంది

‘పాలమూరు’ ప్రాజెక్ట్‌‌ ను బీఆర్‌‌ఎస్‌‌ పట్టించుకోలే..ఈ ప్రాజెక్ట్‌‌ ను కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేస్తుంది
  • అంచనా వ్యయం రూ. 80 వేల కోట్లు అయితే..
     రూ.30 వేల కోట్లతో 90 శాతం పనులు ఎట్లా పూర్తయినయ్‌‌ ?


మహబూబ్‌‌నగర్‌‌, వెలుగు : ‘పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్ట్‌‌ కోసం బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో రూ. 30 వేల కోట్లే ఖర్చు చేశారు. ప్రాజెక్ట్‌‌ పనులు 90 శాతం పూర్తి చేశామని బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు ప్రచారం చేసుకుంటున్నరు. ప్రాజెక్ట్‌‌ అంచనా వ్యయం రూ. 80 వేల కోట్లకు పైగా ఉంటే... రూ. 30 వేల కోట్లతో 90 శాతం పనులు ఎట్లా పూర్తయ్యాయి’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి ప్రశ్నించారు.

 బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు చెప్పే అబద్ధాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. బుధవారం మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌‌రెడ్డితో కలిసి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలోని భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల్లో కోమటిరెడ్డి పర్యటించారు. భూత్పూర్‌‌లో కలెక్టర్‌‌ విజయేందిర బోయి స్వాగతం పలుకగా, పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా భూత్పూర్​లో హోల్‌‌సేల్‌‌ కం రిటైల్‌‌ మార్కెట్‌‌, సీతమ్మ కాంప్లెక్స్ నుంచి స్ట్రోమ్‌‌ వాటర్‌‌ డైన్‌‌, భూత్పూర్‌‌ చెరువు సుందరీకరణ పనులు, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్‌‌, దేవరకద్ర మున్సిపాలిటీలో ఫుట్‌‌పాత్‌‌, మెయిన్‌‌ రోడ్డు అభివృద్ధి, స్పోర్ట్స్‌‌ కాంప్లెక్స్‌‌ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపన చేశారు. 

ఆయా కార్యక్రమాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి మాట్లాడుతూ... పాలమూరు ప్రాజెక్ట్‌‌ను కాంగ్రెస్​ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని చెప్పారు. బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌‌ను నిర్లక్ష్యం చేయడంతో పాటు ఇక్కడి ప్రజలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ప్రజలు ఛీ కొట్టినా, ఓడించినా బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లలో మార్పు రావడం లేదన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్‌‌పర్సన్‌‌ స్వర్ణ సుధాకర్‌‌రెడ్డి పాల్గొన్నారు.