రేట్లు ఘాటెక్కుతున్నయ్!.. కిలో అల్లం రూ.140, వెల్లుల్లి రూ.180

రేట్లు ఘాటెక్కుతున్నయ్!..  కిలో అల్లం రూ.140,  వెల్లుల్లి రూ.180
  •     రెండూ కలిపి రూ. 250 - రూ.300 వరకు అమ్మకాలు
  •     రేట్ల పెంపుతో మార్కెట్​లోకి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు 
  •     కొద్ది రోజులు ధరల పెరుగుదల ఉంటుందంటున్న వ్యాపారులు

హైదరాబాద్, వెలుగు:   అల్లం, వెల్లుల్లి ధరలుపెరుగుతున్నాయి. ప్రస్తుతం సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంది. జనవరి నెలతో పోల్చి చూస్తే.. అల్లం ధర పెరుగుతుండగా.. వెల్లుల్లి రేటు కాస్త తగ్గింది. జనవరిలో కిలో అల్లం రూ. 80, వెల్లుల్లి రూ.300 ఉండేది.  ప్రస్తుతం కిలో అల్లం హోల్ సేల్ లో రూ. 90 –100 వరకు పలుకుతోంది. రిటైల్ లోనైతే రూ.140 –180 వరకు ఉంది. వెల్లుల్లి కిలో  హోల్ సేల్ లో క్వాలిటీని బట్టి రూ.120 –180 ఉండగా, రిటైల్ లో రూ.200 – రూ.260 వరకు ఉంది. రెండూ కలిపి కిలో రూ.250– రూ.280 వరకు అమ్ముతుండగా సాధారణ ప్రజలు రేట్లు చూసి ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 15 రోజులుగా అధికరేట్లకు విక్రయిస్తుండగా.. మరో15 రోజులు ఇలాగే ధరలు ఉండనున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అల్లం, వెల్లుల్లి దిగుబడి తగ్గినట్లు, అందుకే ధరలు పెరిగినట్టు విక్రయదారులు పేర్కొంటున్నారు. ఇంకొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉండనుంది. సిటీలో అల్లం, వెల్లుల్లి ప్రధానంగా ఉస్మాన్ గంజ్, మలక్ పేట, గుడిమల్కాపూర్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతాయి.  

ఇతర రాష్ట్రాల నుంచే ఎక్కువగా దిగుమతి 

సిటీకి అల్లం దిగుమతులు ఎక్కువగా కేరళ నుంచి అవుతుంటాయి. కేరళ, కర్నాటక నుంచి కలిపి అల్లం డైలీ10 లారీల వరకు దిగుమతి చేస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కో లారీలో దాదాపు10 టన్నుల వరకు  ఉంటుంది. తెలంగాణలోని జహీరాబాద్, కోహిర్ నుంచి ప్రస్తుతం ఒక టన్ను మాత్రమే ఉస్మాన్ గంజ్ మార్కెట్ కు వస్తుందంటున్నారు. ఇక్కడి నుంచి గతంలో 3 టన్నులు  వచ్చేది. ప్రస్తుతం ఒక్కసారిగా దిగుమతులు తగ్గాయి. దీంతో కేరళ నుంచే ఎక్కువగా దిగుమతి అవుతుంది. వెల్లుల్లి  మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి ఎక్కువగా వస్తుంది. మధ్యప్రదేశ్ నుంచి కొద్దిరోజుల కిందటి వరకు 4 – 5 లారీలు వచ్చేది . ఒక్కో లారీలో 8 –10 టన్నులు సరుకు ఉంటుంది. ప్రస్తుతం డైలీ15 టన్నులు వస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.  

రేట్ల పెరుగుదలతో మార్కెట్లోకి కల్తీ పేస్టు
 
అల్లం, వెల్లుల్లి రేట్లు పెరగడంతో కొందరు అక్రమార్కులు కల్తీ పేస్టు తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే అల్లం, వెల్లుల్లి పేస్టు అంటూ నమ్మిస్తున్నారు. గల్లీల్లోని కిరాణషాపుల్లో తయారీదారుల పేరు, తేదీలు లేని అల్లం, వెల్లుల్లి పేస్టు డబ్బాలు రూ.10 –20 అమ్ముతున్నారు. అల్లం,వెల్లుల్లి రేట్లు పెరగడంతో తక్కువ ధరలో దొరికే కల్తీది కొనుగోలు చేస్తున్నారు. కల్తీ పేస్టుతో అనారోగ్యలకు గురయ్యే  ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.  అక్రమార్కులపై పోలీసులు నిఘా పెడుతున్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి విక్రయిస్తూనే ఉన్నారు.