పెరగనున్న మెడిసిన్స్ ధరలు

పెరగనున్న మెడిసిన్స్ ధరలు
  •  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: ఎమర్జెన్సీ సహా 800 రకాల మెడిసిన్స్ ధరలు పెరగనున్నాయి. ఇందులో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్​ ఔషధాలున్నాయి. టోకు ధరల సూచిక (డబ్ల్యూపీఐ)లో వార్షిక మార్పునకు అనుగుణంగా మెడిసిన్స్ ధరల పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.  నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్(ఎన్ఎస్ఈఎమ్) కింద ఔషధ ధరలను 0.55 శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించనుంది. 

2022తో పాటు గతేడాది కూడా అత్యవసర ఔషధ ధరలను భారీగా పెంచారు. అప్పుడు 10- నుంచి 12 శాతం మేరకు ధరలు పెరిగాయి. వాటితో పొల్చుకుంటే ఈ ఏడాది ధరలను ఫార్మా కంపెనీలు స్వల్పంగా పెంచనున్నాయి. ప్రతీ ఏటా ఔషధ ధరల పెంపునకు అవకాశం కల్పిస్తారు. అత్యవసర ఔషధాల జాబితాలో సారాసిటమాల్, యాంటీ బయాటిక్స్, అజిత్రోమైసిన్, యాంటీఎనిమియా మెడిసిన్, విటమిన్స్, మినరల్స్ లాంటివి ఉన్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, తీవ్రంగా జబ్బుపడిన రోగులకు ఇచ్చే ఔషధాలు, స్టెరాయిడ్స్ కూడా ధరలు పెరిగే జాబితాలో ఉన్నాయి. 

ముడి సరుకు, ఇతరత్రా ఖర్చులు పెరుగుతోన్న నేపథ్యంలో మెడిసిన్‌‌‌‌‌‌‌‌ ధరలను కూడా పెంచాలని ఫార్మా రంగం డిమాండ్ చేస్తోంది. షెడ్యూల్ డ్రగ్స్ పై పదిశాతం, నాన్ షెడ్యూల్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌పై 20 శాతం మేరకు పెంచాలని కోరుతోంది. ముడి సరుకుల ధరలు 15 శాతం నుంచి 130 శాతం వరకు పెరగడం వల్ల, మెడిసిన్ ధరల పెంపు కూడా అవసరమని పేర్కొంది.