చిప్ఫ్లేషన్తో జేబుకు చిల్లు.. మెమరీ చిప్ల కొరతతో పెరుగుతున్న ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైజ్ల ధరలు

చిప్ఫ్లేషన్తో జేబుకు చిల్లు.. మెమరీ చిప్ల కొరతతో పెరుగుతున్న ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ డివైజ్ల ధరలు
  • సాధారణ చిప్‌‌ల తయారీని తగ్గించిన శామ్‌‌సంగ్, ఎస్‌‌కే హైనిక్స్, మైక్రాన్ వంటి సంస్థలు
  • ఏఐ చిప్‌‌ల తయారీకే  మొగ్గు
  • భారీగా ముందస్తు ఆర్డర్లు చేసుకున్న గూగుల్‌‌, మైక్రోసాఫ్ట్‌‌, మెటా వంటి పెద్ద కంపెనీలు

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)   ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే ఒక సరికొత్త సంక్షోభానికి దారితీస్తోంది. డేటా సెంటర్లు, చిప్స్, నెట్‌‌వర్కింగ్ పరికరాలు, విద్యుత్ గ్రిడ్‌‌ల వంటి ఏఐ మౌలిక సదుపాయాల  కోసం భవిష్యత్తులో ఏకంగా 10 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 960 లక్షల కోట్ల) పెట్టుబడులు అవసరమవుతాయని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గన్ స్టాన్లీ,  టీఎస్ లంబార్డ్ రిపోర్ట్‌‌లు వెల్లడించాయి. 

భారీగా పెట్టుబడులు వస్తుండడంతో ఒకవైపు ఏఐ చిప్‌‌ల తయారీ పెరుగుతున్నా, మరోవైపు ఇతర సాధారణ చిప్‌‌ల తయారీలో కోత పడుతోంది.  దీంతో  మెమరీ చిప్‌‌ల కొరత ఏర్పడగా,  పీసీలు, ఫోన్‌‌లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌‌ల ధరలు భారీగా పెరిగాయి. 

  •  చిప్‌‌ఫ్లేషన్  అంటే..

గత ఆరు దశాబ్దాలుగా (1957 నుంచి 2020 వరకు) టెక్నాలజీ మెరుగయ్యే కొద్దీ మెమరీ చిప్‌‌ల ధరలు ప్రతి ఐదేళ్లకు పది రెట్లు తగ్గుతూ వచ్చాయి. కానీ, ఏఐ రాకతో ఈ ట్రెండ్ పూర్తిగా రివర్స్ అయింది. గత ఏడాది కాలంలోనే మెమరీ చిప్‌‌ల ధరలు ఆరు రెట్లు  పెరిగాయి. ఏఐ అవసరాల కోసం చిప్‌‌ల ధరలు ఇలా నిరంతరాయంగా పెరిగిపోవడాన్నే 'చిప్‌‌ఫ్లేషన్' అంటున్నారు. 

ఆధునిక ఏఐ మోడళ్లు భారీ డేటాను వేగంగా ప్రాసెస్ చేయడానికి హెచ్‌‌బీఎమ్ అనే ప్రత్యేకమైన మెమరీ చిప్‌‌లను వాడుతున్నాయి.  ఈ హెచ్‌‌బీఎమ్ చిప్‌‌ల తయారీకి ఎక్కువ సామర్థ్యం అవసరం అవుతుంది. మెమరీ తయారీ కంపెనీలైన శామ్‌‌సంగ్, ఎస్‌‌కే హైనిక్స్, మైక్రాన్ వంటి సంస్థలు ఎక్కువ లాభాలు ఇచ్చే ఏఐ చిప్‌‌ల తయారీకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనివల్ల సాధారణ ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లలో వాడే మెమరీ చిప్‌‌ల ఉత్పత్తి తగ్గిపోతోంది.

  • రెండు వర్గాలుగా..

మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం, ఏఐ మార్కెట్ ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది.  గూగుల్‌‌, మెటా, మైక్రోసాఫ్ట్‌‌ వంటి పెద్ద టెక్ కంపెనీలు భవిష్యత్తులో తయారు కాబోయే చిప్‌‌లను ఇప్పుడే భారీ ఒప్పందాల ద్వారా బుక్ చేసుకుంటున్నాయి. మరోవైపు  చిప్‌‌ల కోసం ఇతర కంపెనీలు తీవ్రంగా పోటీ పడాల్సి వస్తోంది. చిప్‌‌ల కొరతతో 2027 నాటికి కంప్యూటర్ మెమరీ సప్లయ్‌‌లో 15శాతం, స్మార్ట్‌‌ఫోన్ మెమరీ సప్లయ్‌‌లో 12శాతం కొరత ఏర్పడనుంది. 

అంటే మార్కెట్లో దాదాపు 5.8 కోట్ల కంప్యూటర్లు, 13.4 కోట్ల స్మార్ట్‌‌ఫోన్ల ఉత్పత్తి ఆగిపోవచ్చు లేదా వాటి ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. ఈ చిప్‌‌ఫ్లేషన్ ప్రభావం కార్లు, హెల్త్‌‌కేర్ పరికరాలు, ఇండస్ట్రియల్ సిస్టమ్స్‌‌పై కూడా పడనుంది. చివరకు డేటా సెంటర్‌‌ల ఖర్చులు పెరిగి, సాధారణ కంపెనీలకు క్లౌడ్ కంప్యూటింగ్ చార్జీలు కూడా భారం కానున్నాయి. 

  • పెద్ద మొత్తంలో ఏఐ ఖర్చులు

టీఎస్ లంబార్డ్ అంచనా ప్రకారం.. ఒక్క 2026 లోనే ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఖర్చులు  800 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.77  లక్షల కోట్ల) కు చేరనుంది.  ఇందులో 80శాతం వాటా అమెరికాదే. అయితే, ప్రస్తుతానికి ఏఐ ద్వారా వస్తున్న ఆదాయం తిరిగి కేవలం టెక్ కంపెనీల (చిప్స్ తయారీదారులు,  క్లౌడ్ ప్రొవైడర్లు) మధ్యే తిరుగుతోంది. 

ఈ ఏఐ ఇన్వెస్ట్‌‌మెంట్ సైకిల్ దీర్ఘకాలం విజయవంతం కావాలంటే, సాధారణ వ్యాపారాలు,  వినియోగదారులు దీనిని పెద్ద ఎత్తున స్వీకరించి, ఉత్పాదకతను పెంచుకోగలిగితేనే సాధ్యమవుతుంది.