దారుణం..గుడి భూముల గొడవలో పూజారిపై కాల్పులు

దారుణం..గుడి భూముల గొడవలో పూజారిపై కాల్పులు

 

గోండా(యూపీ): గుడి భూముల వివాదంలో రాజస్థాన్ లో పూజారిని సజీవ దహనం చేసిన ఘటనను మరువకముందే అలాంటిదే మరొకటి జరిగింది. గుడి భూముల గొడవ విషయంలో కొంతమంది పూజారిపై కాల్పులు జరిపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో జరిగింది. తిర్రె మనోరమ ఊరిలోని రామ్ జానకీ టెంపుల్ కు 30 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ అతుల్ బాబా అలియాస్ సామ్రాట్ దాస్ పూజారిగా పని చేస్తున్నారు. మనోరమ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయ భూములకు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో వాటిపై కన్నేసిన కొంతమంది గ్రామస్తులు.. ఆదివారం తెల్లవారుజామున గుడిలో నిద్రపోతున్న పూజారిపై కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ ఆయన ఎడమ భుజంలోకి చొచ్చుకెళ్లింది. దాస్ ను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్పించామని, ఆయన ఆరోగ్యం స్టేబుల్ గా ఉందని ఎస్పీ శైలేశ్ కుమార్ పాండే తెలిపారు. నలుగురిపై మర్డర్ కేసు నమోదు చేశామని, ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఊరిలో బందోబస్తు ఏర్పాటు చేశామని, అక్కడంతా కంట్రోల్ లోనే ఉందని పేర్కొన్నారు. ఈ భూమి విషయంలో ఇంతకుముందు నుంచే వివాదం ఉందని, లోకల్ కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు.