
న్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎక్కువగా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం పెరిగిందని తెలిపారు. సేంద్రియ సాగుతో కూడా రైతులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ దిగుబడి సాధించే 109 కొత్త రకం వంగడాలను ఆయన ఆదివారం విడుదల చేశారు.
ఈ విత్తనాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డెవలప్ చేసింది. ఈ కొత్తరకం విత్తనాలు ఎలాంటి వాతావరణ పరిస్థితులను అయినా తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్‌లో నిర్వహించిన ప్రోగ్రామ్‌కు ప్రధాని మోదీ హాజరయ్యారు. విత్తనాలు విడుదల చేసి.. రైతులతో పాటు సైంటిస్టులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘కొత్త రకం విత్తనాలతో దిగుబడి మరింత పెరుగుతుంది. దీంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకునేందుకే ఇష్టపడుతున్నరు. మిల్లెట్ల సాగుకు కేంద్రం ప్రోత్సహిస్తున్నది. నేచురల్ ఫార్మింగ్‌తో రైతులు ఎంతో లాభాలు పొందొచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్‌పై ఫోకస్ పెట్టాలి’’అని మోదీ అన్నారు.
కేవీకేల పాత్ర ఎంతో కీలకం
కృషి విజ్ఞాన్ కేంద్రాలు (కేవీకే) పంటల సాగులో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. మరిన్ని కొత్త వంగడాలు సృష్టించేందుకు కృషి చేయాలని సూచించారు. ‘‘సేంద్రియ సాగుపై ప్రతి నెలా రైతులకు అవగాహన కల్పించాలి. రోజురోజుకూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచాలి. కొత్త వంగడాలతో ఎలాంటి లాభాలు పొందొచ్చనే దానిపై అవేర్ నెస్ తీసుకురావాలి.
కొత్త వంగడాలు ఉత్పత్తి చేయడంలో కీలకంగా వ్యవహరించిన సైంటిస్టులకు అభినందనలు’’అని మోదీ అన్నారు. కృషి విజ్ఞాన్ కేంద్రాలతో ఎంతో లాభపడుతున్నామని రైతులు తెలిపారు. నేచురల్ ఫార్మింగ్‌ను కేంద్రం ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. ఫీల్డ్ క్రాప్స్‌లో మిల్లెట్లు, ఆయిల్ సీడ్స్, పప్పు ధాన్యాలు, చెరకు, ఫైబర్, పత్తి ఉన్నాయి.
హార్టికల్చర్ క్రాప్స్‌లో కూరగాయలు, పండ్లు, ప్లాంటేషన్ క్రాప్స్, దుంపలు, సుగంధ ద్రవ్యాలతో పాటు ఔషధ మొక్కలు ఉన్నాయి. 61 పంటలకు సంబంధించి మొత్తం 109 కొత్త రకం విత్తనాలను రిలీజ్ చేయడం సంతోషకరమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు.