ప్రపంచానికే ఆదర్శంగా మన ఇండియా: ప్రధాని మోదీ

ప్రపంచానికే ఆదర్శంగా మన ఇండియా: ప్రధాని మోదీ
  • దేశాన్ని పునర్నిర్మించే బాధ్యతను దేవుడే తనకిచ్చాడని వెల్లడి
  • లక్నో ఇన్వెస్టార్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని
  • కల్కీధామ్ శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ


సంభాల్(యూపీ): ఇండియా అనే ఆలయాన్ని పునర్ నిర్మించే బాధ్యత దేవుడు తనకు ఇచ్చాడని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచానికే మన దేశం ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ నుంచి దేశంలో కొత్త ఆధ్యాత్మిక కాల చక్రం ప్రారంభమైందన్నారు. శ్రీరాముడు అయోధ్యను పాలించినప్పుడు ఆయన ప్రభావం కొన్ని వేల సంవత్సరాలు కొనసాగిందని తెలిపారు. ఇప్పుడు రామ్​లల్లా సింహాసనం అధిష్ఠించడంతో దేశానికి రానున్న వెయ్యేండ్లకు కొత్త ప్రయాణం ప్రారంభమైందన్నారు.

ఉత్తరప్రదేశ్‌‌ సంభాల్‌‌ పరిధిలోని ఐంచోడ కాంబోహ్‌‌లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రీయ రూపి మందిర్ (దేశమనే ఆలయం)’’ని పునర్ నిర్మించే బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. కల్కి ధామ్‌‌కు శంకుస్థాపన చేయడం నాకు దక్కిన వరం. దేశంలో ఒకవైపు పుణ్య క్షేత్రాలను అభివృద్ధి చేస్తూనే.. నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం’’ అని మోదీ అన్నారు.

రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు

విదేశాల్లో ఉన్న పురాతన విగ్రహాలను తిరిగి ఇండియాకు తెచ్చుకుంటున్నామని ప్రధాని మోదీ తెలిపారు. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ‘‘కాలచక్రం తిరగబడి కొత్త శకం మన తలుపు తడుతున్నది అనడానికి ఈ మార్పే నిదర్శనం. మనం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. యూపీ ప్రజల 18 ఏండ్ల నిరీక్షణ తర్వాత కల్కి ధామ్​కు శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. భవిష్యత్తులో ఏ మంచి పని మిగిలిపోయినా మహనీయులు, ప్రజల ఆశీస్సులతో వాటిని పూర్తి చేస్తాను’’ అని ప్రధాని మోదీ అన్నారు. 

అన్ని దేశాలు ఇండియాను అనుసరిస్తున్నయ్​

ఇండియా ఏ దేశాన్ని కూడా అనుసరించడంలేదని, ప్రపంచానికే ఇండియా ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ రంగంలో ఇండియాను మొదటిసారి అవకాశాల కేంద్రంగా చూస్తున్నారని తెలిపారు. దేశం ఒక ఇన్నోవేషన్ హబ్​గా గుర్తింపు పొందిందని వివరించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఇండియా అవతరించిందని తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టామన్నారు. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న అబుదాబిలో భారీ ఆలయం నిర్మించుకున్నామని తెలిపారు. కాశీ, విశ్వనాథ ధామం నిర్మించుకున్నామన్నారు. సోమనాథ్, కేదార్ నాథ్ వంటి ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి, కల్కీ ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ క్రిష్ణం పాల్గొన్నారు. 

రెడ్ టేప్ సంస్కృతి పోయి..రెడ్ కార్పెట్ కల్చర్ వచ్చింది

యూపీలో ఇన్వెస్టర్ల కోసం రెడ్‌‌ టేప్‌‌ సంస్కృతి పోయి.. రెడ్‌‌ కార్పెట్‌‌ కల్చర్ వచ్చిందని మోదీ అన్నారు. ఏడేండ్లుగా డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాన్ని ఎంతో వేగంగా అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. పరిస్థితులన్నీ మారిపోయాయన్నారు. యూపీ టూర్​లో భాగంగా లక్నోలో నిర్వహించిన ‘ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్’​లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 4వ ఎడిషన్​ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో వాణిజ్యం, అభివృద్ధి, విశ్వాసంతో కూడిన వాతావరణం ఉంది.

యూపీలో పెట్టుబడులు, జాబ్​లు వస్తాయని ఏడేండ్ల కింద ఎవరూ అనుకోలే. అప్పుడు హత్యలు, అల్లర్లు జరిగేవి. అప్పటి యూపీతో పోల్చుకుంటే.. ఇప్పుడు ఎంతో మారిపోయింది. భారతరత్నపై ఒకే కుటుంబానికి చెందిన వారికి హక్కు ఉండేది. అందుకే బీఆర్ అంబేద్కర్​కు దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నా.. భారతరత్న ఇవ్వలేదు’అని మోదీ విమర్శించారు.