చాయ్​వాలా ప్రధాని కావడంతో ప్రతిపక్షాలు కలత చెందాయ్

చాయ్​వాలా ప్రధాని కావడంతో ప్రతిపక్షాలు కలత చెందాయ్
  • ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : దేశానికి మొదటిసారి ఓ చాయ్​వాలా ప్రధాని కావడంతో ప్రతిపక్షాలు కలత చెందాయని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్సేతర వ్యక్తికి మూడోసారి పదవి దక్కడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. మంగళవారం ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన మోదీని ఎన్డీయే నేతలు సన్మానించారు.   ఈ సందర్భంగా తమ కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మోదీ ప్రసంగం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌‌ రిజిజు మీడియాకు వెల్లడించారు.

ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధివిధానాలు పాటించాలని మోదీ సూచించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు సభలో ఎలా వ్యవహరించాలో సీనియర్​సభ్యులనుంచి నేర్చుకోవాలని అన్నారు. అలాగే, క్రమంతప్పకుండా పార్లమెంట్​సమావేశాలకు హాజరుకావాలని, నియోజకవర్గ సమస్యలను లేవనెత్తాలని సూచించారు. తాము మాట్లాడాలనుకున్న అంశంపై ముందుగానే స్టడీ చేయాలని తెలిపారు.  మీడియా ఎదుట అనవసర వ్యాఖ్యలు చేయొద్దని ఎంపీలకు సూచించారు. నియోజకవర్గ ప్రజలు అందుబాటులో ఉండాలని, ఓటు వేసి గెలిపించినందుకు వారి రుణం తీర్చుకోవాలని అన్నారు.