ఇంకా ఎంతకాలం ఈ ఫేక్ ప్రచారం : ప్రధాని మోదీ

ఇంకా ఎంతకాలం ఈ ఫేక్ ప్రచారం : ప్రధాని మోదీ
  • కాంగ్రెస్​పై మండిపడ్డ ప్రధాని మోదీ 
  • రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపణ
  • 1977లో ఒక్కసారే  ‘రాజ్యాంగ రక్షణ’పై  ఎన్నికలు జరిగినయ్
  • ఇందిరా గాంధీ సర్కారును జనం విసిరిపారేశారన్న ప్రధాని

న్యూఢిల్లీ: రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీయే అతిపెద్ద ప్రత్యర్థి అని, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికలు ‘రాజ్యాంగ రక్షణ’ అనే అంశంపైనే జరిగాయన్న ప్రతిపక్షాల వాదనలను ఆయన ఖండించారు. ‘‘రాజ్యాంగ రక్షణ అనే అంశంపై ఇండియన్లు ఒక్కసారి (1977లో) మాత్రమే ఓటు వేశారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఆ లోక్ సభ ఎన్నికల్లో అప్పటి ఇందిరాగాంధీ సర్కారును విసిరి అవతల పారేశారు’’ అని మోదీ ఫైర్ అయ్యారు. నిజానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీయే రాజ్యాంగాన్ని అవమానించిందని, ఎన్నికలు రాగానే రాజ్యాంగ పరిరక్షణ అంటూ డ్రామాలు ఆడుతోందన్నారు.

ప్రతిపక్షాలు రాజ్యాంగ దినోత్సవాన్ని సైతం వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం రాజ్యసభలో ప్రధాని మాట్లాడారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ‘‘మీరు ఇంకెంతకాలం ఈ ఫేక్ ప్రచారం చేస్తారు? 1977 ఎన్నికల్లో న్యూస్ పేపర్లు, రేడియోను బంద్ పెట్టిన విషయం మరిచిపోయారా? అప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ అనే ఒకే ఒక్క అంశం మీద అప్పుడు ఓట్లేశారు. నాటి ఎన్నికల కంటే బాధాకరమైన ఎన్నికలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు” అని ఆయన చెప్పారు.  

ప్రతిపక్షాల వాకౌట్ 

రాజ్యాంగ రక్షణపై ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయంటూ మోదీ చేసిన కామెంట్లపై ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు స్పందిస్తూ.. ‘మోదీ అబద్ధాలకోరు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనిపై జోక్యం చేసుకుని మాట్లాడేందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రయత్నించగా చైర్మన్ ధన్ ఖడ్ తిరస్కరించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

పోరాడే ధైర్యం లేక పారిపోయారు.. 

ఎన్డీయే కూటమికి అనుకూలంగా 140 కోట్ల మంది ప్రజలు తీర్పునివ్వడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, వారి బాధను తాను అర్థం చేసుకోగలనని మోదీ అన్నారు. ‘‘నిన్న కూడా వారి ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. నేడు పోరాడే ధైర్యం లేక సభ నుంచి పారిపోయారు. నేను మాత్రం విధి నిర్వహణకే కట్టుబడి ఉన్నా. చర్చలో పైచేయి సాధించేందుకు కాదు.. దేశ సేవ కోసమే నేను ఇక్కడున్నా. మా ప్రభుత్వం చేసిన పనులను వివరించడమే నా డ్యూటీగా భావిస్తున్నా” అని ఆయన తెలిపారు. 

నీట్ దోషులను కఠినంగా శిక్షిస్తాం.. 

నీట్, ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో అవకతవకల అంశంపైనా మోదీ స్పందించారు. పేపర్ లీకేజీలో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ‘‘పేపర్ లీకేజీ వంటి సెన్సిటివ్ అంశంపై రాజకీయాలు చేయరాదు. కానీ ప్రతిపక్షాలు అదే చేస్తున్నాయి. నేను దేశ యువతకు హామీ ఇస్తున్నా. లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆటలాడుకున్న వారికి కఠిన శిక్ష పడేలా చూస్తాం” అని స్పష్టం చేశారు.

టెర్రరిజంపై పోరు లాస్ట్ స్టేజ్ లో ఉంది.. 

జమ్మూకాశ్మీర్​లో టెర్రరిజంపై పోరాటం చివరి దశకు చేరిందని ప్రధాని మోదీ చెప్పారు. మిగిలిన నెట్ వర్క్ ను అంతం చేసేందుకు వివిధ స్ట్రాటజీలను అమలు చేస్తున్నామన్నారు. టెర్రర్ దాడి ఘటనలు తగ్గాయన్నారు. వేర్పాటువాదం ముగిసిపోతోందని, వీటిపై పోరాటంలో అక్కడి ప్రజలు ముందున్నారని చెప్పారు. టూరిజం పెరుగుతోందని, పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని మోదీ చెప్పారు. 

ఉభయసభలు నిరవధిక వాయిదా

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత రాజ్యసభను చైర్మన్ ధన్​ఖడ్ నిరవధికంగా వాయిదా వేశారు. ప్రధాని రిప్లై ఇచ్చిన తర్వాత ధన్యవాద తీర్మానం ఆమోదం పొందడంతో ముగిసింది. 18వ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని మంగళవారమే రిప్లై ఇచ్చారు. ఆపై స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

మణిపూర్​లో హింస తగ్గుతోంది.. 

ఈశాన్య రాష్ట్రం మణిపూర్​లో హింస తగ్గుముఖం పట్టిందని, రాష్ట్రంలో శాంతి నెలకొనే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ చెప్పారు. మణిపూర్​లో పరిస్థితి సాధారణ స్థితికి వస్తోందని, రాష్ట్రంలోని అనేక చోట్ల స్కూల్స్, షాపులు ఓపెన్ అవుతున్నాయని తెలిపారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి 11 వేల ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని, 500కుపైగా మందిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడం కోసం అవసరమైన ప్రతి ఒక్కరితోనూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు.