మెడికల్​ ఫీల్డ్​లోకి ప్రైవేట్ ​సంస్థలు రావాలే

మెడికల్​ ఫీల్డ్​లోకి ప్రైవేట్ ​సంస్థలు రావాలే

న్యూఢిల్లీ: మెడికల్​ ఫీల్డ్​లోకి పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. శనివారం ఆరోగ్య శాఖ పోస్ట్ బడ్జెట్ వెబినార్​ను ప్రధాని ప్రారంభించి మాట్లాడారు. ‘‘మన పిల్లలు చదువుకోవడానికి చిన్న చిన్న దేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా మెడిసిన్​  స్టడీకోసం చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. భాషాపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, అక్కడికెళ్లి చదువుకుంటున్నారు. ఫలితంగా వేల కోట్ల రూపాయలు విదేశాలకు వెళ్తున్నాయి” అని ఆవేదన వ్యక్తంచేశారు. మన స్టూడెంట్లకు మన దేశంలోనే మెడిసిన్​ చదివేందుకు అవకాశం  రావాలని, ప్రైవేటు ఇనిస్టిట్యూట్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇనిస్టిట్యూట్ల ఏర్పాటుకు భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పాలసీలు రూపొందించాలని సూచించారు. అప్పుడు మనమే ప్రపంచ డిమాండ్​కు సరిపడా పెద్ద సంఖ్యలో డాక్టర్లను, పారామెడికల్ స్టాఫ్​ను తయారు చేయగలమన్నారు. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్​లో మన స్టూడెంట్లు చిక్కుకుపోవడం, వారిలో చాలామంది మెడిసిన్ స్టూడెంట్లు ఉండడంతో మోడీ ఈ కామెంట్లు చేశారు. 

పల్లెల్లో హెల్త్ సెంటర్లు..

హెల్త్ కేర్ రంగంలో సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నామని మోడీ చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకూ మంచి ట్రీట్​మెంట్​ అందేలా, ‘‘వన్ ఇండియా వన్ హెల్త్” స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని తెలిపారు. పల్లెలు మొదలు జిల్లా స్థాయి వరకు హెల్త్​ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వీటి నిర్వహణలో ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల హెల్త్​ సెంటర్లు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 85 వేల సెంటర్లలో సేవలు మొదలయ్యాయని చెప్పారు. హెల్త్ కేర్ సేవలకు డిమాండ్  పెరగడంతో హెల్త్ సెక్టార్ కు ఈసారి బడ్జెట్ పెంచామన్నారు.

దేశంలో అందరికీ డిజిటల్​హెల్త్​అకౌంట్

ఆయుష్మాన్​ భారత్​ డిజిటల్​ మిషన్(ఏబీడీఎం) ప్రోగ్రామ్​ను దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్ర కేబినెట్ ​నిర్ణయించింది. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్​పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏబీడీఎం అమలు కోసం రూ.1600 కోట్ల నిధులు కేటాయించింది. ఇందుకు నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్ హెచ్ఏ) ఏజెన్సీగా వ్యవహరించనుంది.