కాంగ్రెస్ నేతల ఆలోచనల్లో ఆ ఒక్క కుటుంబమే : ప్రధాని మోదీ 

కాంగ్రెస్ నేతల ఆలోచనల్లో ఆ ఒక్క కుటుంబమే : ప్రధాని మోదీ 
  • ఒక ఫ్యామిలీ అభివృద్ధి కోసం పార్టీని వాడుకుంటున్నరు: ప్రధాని మోదీ 
  • కాంగ్రెస్ హయాంలో అన్నీ కుంభకోణాలే
  • మేం వచ్చాకే స్కాంలకు ఫుల్ స్టాప్ పెట్టినం
  • గుజరాత్​లో ‘సుదర్శన సేతు’ను ప్రారంభించిన పీఎం 
  • దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జిగా రికార్డు

దేవభూమి ద్వారక: కేవలం ఒక్క కుటుంబం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తాన్ని వాడుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అన్ని రకాల కుంభకోణాలు జరిగాయని, తాము గత పదేండ్లుగా అలాంటి స్కాంలన్నింటినీ నివారించామన్నారు. ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. గుజరాత్ లోని ద్వారక జిల్లా ఓఖా పట్టణం నుంచి అరేబియా సముద్రంలోని బెట్ ద్వారక ఐల్యాండ్ మధ్య నిర్మించిన దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ‘సుదర్శన సేతు’ను ప్రధాని ఆదివారం ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బెట్ ద్వారక ఐల్యాండ్ ను ఓఖా పట్టణంతో ఈ బ్రిడ్జి కలుపుతుందన్నారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నో సార్లు ప్రతిపాదనలు పంపినా.. అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ‘‘ఏం చేసినా ఒక్క కుటుంబం కోసమే చేస్తే.. దేశ అభివృద్ధి గురించి ఇక ఎవరు ఆలోచిస్తారు?

ప్రతిసారీ ఐదేండ్ల పాటు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం, కుంభకోణాలను దాచడంపైనే వారు దృష్టి పెడుతూ వచ్చారు” అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలన కొనసాగి ఉంటే దేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలోనే ఉంచేవారన్నారు. తమ ప్రభుత్వం అన్ని కుంభకోణాలకు ఫుల్ స్టాప్ పెట్టడమే కాకుండా సుదర్శన సేతు వంటి ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లను సృష్టించిందన్నారు. ‘‘సుదర్శన సేతు నిర్మాణం కోసం ఆరేండ్ల కిందట నేను శంకుస్థాపన చేశాను. నేడు ఈ బ్రిడ్జిని ప్రారంభించాను. ఇదీ మోదీ గ్యారంటీ” అని అన్నారు.

టెలికం సెక్టార్ ను బలోపేతం చేయాల్సిన సమయంలో కాంగ్రెస్ 2జీ స్కాంను సృష్టించింది. రక్షణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన టైంలో హెలికాప్టర్, సబ్ మెరైన్ స్కాం చేసింది. దేశ అవసరాల విషయంలో కాంగ్రెస్ ప్రతిసారీ మోసం చేసింది” అని మోదీ మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక పదేండ్లలోనే దేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చిందని ఆయన చెప్పారు. ముంబైలో అటల్ సేతు, కాశ్మీర్ లో చీనాబ్ నదిపై బ్రిడ్జి వంటి ఎన్నో కట్టడాలను తాము సృష్టించామన్నారు.
 
డ్రగ్స్ నుంచి యువతను కాపాడాలె

దేశ యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడాలని, ఇందుకోసం వారికి కుటుంబం నుంచి గట్టి మద్దతు అవసరమని మోదీ అన్నారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలంటే కుటుంబాల పాత్రే చాలా కీలకమన్నారు. నేషనల్ యూనిటీ కోసం గాయత్రి పరివార్ సంస్థ ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహిస్తున్న అశ్వమేధ మహాయజ్ఞం కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ ఆదివారం వర్చువల్ గా మాట్లాడారు. ‘‘కుటుంబం ఒక ఇనిస్టిట్యూట్ వంటిది. అది వీక్ అయితే విలువలు దిగజారుతయ్​. కుటుంబసభ్యులు రోజుల తరబడి కలవకుండా, కూర్చుని మాట్లాడుకోకుండా ఉంటే ప్రమాదాలు పెరుగుతాయి. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలంటే బలమైన కుటుంబాలు అవసరం” అని ప్రధాని తెలిపారు. 

ఐదు ఎయిమ్స్ భవనాలు ప్రారంభం  

గుజరాత్​లోని రాజ్​కోట్ ఎయిమ్స్ క్యాంపస్​లో కొత్తగా సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ భవనాన్ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. అలాగే ఏపీ(మంగళగిరి), పంజాబ్(భటిండా), యూపీ (రాయ్ బరేలీ), బెంగాల్ (కల్యాణి)లో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్ క్యాంపస్​లలోని సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్​ను కూడా వర్చువల్​గా ప్రారంభించారు. ఈ మొత్తం ఐదు ఎయిమ్స్ క్యాంపస్​లలోని సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్ నిర్మాణానికి కేంద్రం రూ.6,300 కోట్లను ఖర్చు చేసింది. దేవభూమి ద్వారక, జామ్ నగర్, పోర్ బందర్ జిల్లాల్లోని రూ. 4,100 కోట్ల ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపనలు చేశారు. 

సుదర్శన సేతు విశేషాలు ఇవే.. 

గుజరాత్ లోని ద్వారక జిల్లా ఓఖా పట్టణాన్ని అరేబియా సముద్రంలోని బెట్ ద్వారక ద్వీపంతో అనుసంధానం చేసేందుకు ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. ముందుగా సిగ్నేచర్ బ్రిడ్జి అని పేరు పెట్టిన ఈ బ్రిడ్జికి తాజాగా సుదర్శన సేతుగా పేరు మార్చారు. దీనికి ప్రధాని మోదీ 2017 అక్టోబర్ లో శంకుస్థాపన చేశారు. మొత్తం 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జిగా నిలిచింది. బ్రిడ్జి నిర్మాణానికి రూ. 979 కోట్లు వెచ్చించారు. 27.20 మీటర్ల వెడల్పు ఉన్న ఈ బ్రిడ్జిపై ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్ పాత్ లు ఏర్పాటు చేశారు. ఫుట్ పాత్ ల వెంబడి శ్రీకృష్ణుడి ఫొటోలు, భగవద్గీత శ్లోకాలను ఏర్పాటు చేశారు.

సముద్రం అడుగున పూజలు 

సుదర్శన సేతు ప్రారంభం సందర్భంగా బెట్ ద్వారక ద్వీపం సమీపంలో స్కూబా డైవింగ్ చేసి అరేబియా సముద్రం అడుగున మోదీ పూజలు చేశారు. డైవింగ్ హెల్మెట్ ధరించి సముద్రం అడుగుకు చేరుకున్న ఆయన శ్రీకృష్ణుడికి నివాళిగా నెమలి పింఛాన్ని ఉంచి దండం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మోదీ సముద్రం అడుగున కూర్చునేందుకు, పూజ చేసేందుకు నేవీ డైవర్లు సాయం చేశారు. బయటికి వచ్చిన తర్వాత మాట్లాడుతూ.. ఇందులో సాహసం కన్నా భక్తి విశ్వాసాలే ఎక్కువన్నారు. సముద్రంలో మునిగిన ద్వారకా నగరానికి పూజలు చేసి, శ్రీకృష్ణుడిని ప్రార్థించడం అద్భుతమైన అనుభూతి కలిగిందన్నారు.  శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.