తెలంగాణ, ఏపీలో వ్యాక్సిన్​ను వేస్ట్​ చేస్తున్నరు

తెలంగాణ, ఏపీలో వ్యాక్సిన్​ను వేస్ట్​ చేస్తున్నరు

న్యూఢిల్లీ: కరోనాపై పోరాడేందుకు ఏడాది తర్వాత దక్కిన వ్యాక్సిన్​ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో వేస్ట్​ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో విలువైన ఈ వ్యాక్సిన్​ ఆయుధాన్ని వేస్ట్​ చేయడం బాధాకరమన్నారు. జీరో వేస్టేజీ లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు సమీక్షలు జరుపుకోవాలని, ప్రత్యేక మానిటరింగ్​ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బుధవారం అన్ని రాష్ట్రాల సీఎంలు, హెల్త్​ ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు.  రాష్ట్రం నుంచి గవర్నర్​ తమిళిసై పాల్గొన్నారు. ‘‘కరోనా వల్ల యావత్​ ప్రపంచం ఎంత అల్లాడిందో అందరికీ తెలుసు. ఏడాది తర్వాత మనకు దక్కిన ఆయుధం వ్యాక్సిన్​. దాన్ని  వేస్ట్​ చేయడం బాధకలిగిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో 10 శాతం కంటే ఎక్కువగా వ్యాక్సిన్  డేస్​లు  వేస్టు చేస్తున్నరు. ఉత్తరప్రదేశ్​లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఎందుకు అట్ల జరుగుతున్నదో ఆయా ప్రభుత్వాలు సమీక్షించుకోవాలి. ప్రతి రోజూ సాయంత్రం ప్రత్యేక వ్యవస్థ ద్వారా మానిటరింగ్​ చేసుకోవాలి. జీరో వేస్టేజీ టార్గెట్​గా ముందుకు వెళ్లాలి. ప్రయత్నం మొదలు పెడితే కానిది ఏదీ లేదు” అని  ప్రధాని మోడీ సూచించారు. ఏ రోజు ఎంత వ్యాక్సిన్​ వాడాలో సరైన ప్లానింగ్​ వేసుకోవాలన్నారు. అధికారులను తాము  తప్పుపట్టడం లేదని, వేస్టేజీ సమస్య లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. వ్యాక్సిన్​ ఎక్స్​పైరీ డేట్  ముగియకముందే  వాడితే వేస్టేజీ సమస్య రాదన్నారు. ‘‘మొదట వచ్చిన వ్యాక్సిన్​ డోస్​లను మొదటే వాడాలి. తర్వాత వచ్చిన డోస్​లను తర్వాత వాడాలి. కానీ.. తర్వాత వచ్చిన డోస్​లను ముందు వాడి.. ముందు వచ్చిన డోస్​లను పక్కన పెట్టడంతో వేస్టేజీ సమస్య ఏర్పడుతోంది. ముందు వచ్చిన డోస్​లను అట్లనే ఆపి పెట్టడంతో వాటి ఎక్స్​పైరీ డేట్​ ముగుస్తోంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది” అని స్పష్టం చేశారు. 

తెలంగాణలో 17.6 శాతం..

దేశంలో కరోనా వ్యాక్సిన్​ను వేస్ట్​ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్​ ప్లేస్​లో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 6.5 శాతం వ్యాక్సిన్​ వేస్ట్​ అవుతుంటే.. ఒక్క తెలంగాణలోనే 17.6 శాతం పనికిరాకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అటు తర్వాత ఆంధ్రప్రదేశ్​లో 11.6 శాతం వ్యాక్సిన్​ వేస్ట్​ అవుతున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్​ వేస్టేజీని అరికట్టాలని ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్​లో ప్రకటించిన తర్వాత హెల్త్​ మినిస్ట్రీ.. ఏ ఏ రాష్ట్రాల్లో ఎంత మేరకు వ్యాక్సిన్​ వేస్ట్​ అవుతోందో లెక్కలతో వివరించింది. ‘‘ఎంతో విలువైన వ్యాక్సిన్​ వేస్ట్​గా పోవడంపై  ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 6.5శాతం వ్యాక్సిన్​ వేస్ట్​ అవుతుంటే.. తెలంగాణలోనే 17.6శాతం వేస్ట్​ అవుతోంది. అటు తర్వాత ఏపీలోనూ ఎక్కువ శాతం వేస్ట్​ అవుతోంది. దీన్ని అరికట్టాలని ఆయా రాష్ట్రాలకు మేం సూచించాం” అని నీతి ఆయోగ్​ మెంబర్(హెల్త్​) డాక్టర్​ వీకే పౌల్,  హెల్త్​ సెక్రటరీ రాజేశ్​ భూషణ్​ చెప్పారు.