
వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ లీడర్ గా నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఆయన ‘మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్’గా మొదటి స్థానం పొందారు. సర్వేలో జులై 8 నుంచి 14 వరకు సేకరించిన డేటాతో ప్రపంచ నేతలకు ర్యాంకులు కేటాయించారు. మోదీ 69% అప్రూవల్ రేటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.
ఆయన తర్వాత మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ (63%), అర్జెంటినా ప్రెసిడెంట్ జేవియెర్ మిలీ (60%) రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. అయితే, జాబితాలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ (39%), బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ (45%) వంటి కీలక నేతలంతా వెనకబడ్డారు. కీర్ స్టార్మర్ 6వ ప్లేస్ లో, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ 8వ ప్లేస్ లో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ 10వ స్థానంలో నిలవగా.. బైడెన్ 12వ స్థానానికి పడిపోయారు.
మొత్తం 25 మంది నేతలు ఉన్న ఈ జాబితాలో జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా అత్యంత తక్కువ జనామోదం( కేవలం16%) ఉన్న నేతగా అట్టడుగు స్థానంలో నిలిచారు. ‘‘సర్వేలోని అప్రూవల్ రేటింగ్స్ అనేవి ప్రతి దేశంలో వారి నాయకుల పట్ల అక్కడి పెద్దవారి అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయి” అని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కాగా, ఈ సంస్థ రెగ్యులర్ గా సర్వేల డేటా ఆధారంగా ప్రపంచ దేశాల నాయకులకు వారి వారి దేశాల్లో ఉన్న జనామోదాన్ని బట్టి ర్యాంకులను మారుస్తూ ఉంటుంది. ఇదివరకు నిర్వహించిన పలు సర్వేల్లోనూ ప్రధాని మోదీ టాప్ లో నిలిచారు.
మస్క్ పిల్లలతో మోదీ ఫొటో..
ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ పిల్లలతో ప్రధాని మోదీ గతంలో దిగిన ఫొటోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. మస్క్ ఆ ఫొటోపై స్పందించారు. ఆ ఫొటోలో ఉన్న తన పిల్లల పేర్లు డామియన్, కైకోత్ అని చెప్పారు. ఇప్పుడు ఈ ఫొటో మళ్లీ వైరల్ అవుతోంది.