ప్రధాని తల్లి కన్నుమూత..అంత్యక్రియలు నిరాడంబరంగా..

ప్రధాని తల్లి కన్నుమూత..అంత్యక్రియలు నిరాడంబరంగా..

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తల్లి మరణం గురించి తెలియగానే మోడీ.. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌‌కు చేరుకున్నారు. సోదరుడు పంకజ్ మోడీ ఇంటి వద్ద  తల్లికి నివాళులర్పించారు. మార్చురీ వ్యాన్‌‌లో హీరాబెన్ పార్థివ దేహం ఉంచగా.. శ్మశానం దాకా అందులోనే ప్రధాని ప్రయాణించారు. తన సోదరులతో కలిసి పాడె మోశారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే మోదీ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అహ్మదాబాద్: దేశ ప్రధానికి తల్లి ఆమె.. నిండునూరేళ్లు జీవించి శుక్రవారం కన్నుమూసింది. అయినా అక్కడ నేతల హడావుడి కనిపించలే.. అధికార దర్పం అక్కడ అడుగే పెట్టలే.. తల్లి అంతిమయాత్రలో సామాన్యుడిలాగే వ్యాన్​ లో కూర్చుని ప్రయాణించాడు. భుజాన పాడె మోసి, చేతులు జోడించి నమస్కరిస్తూ.. దగ్గరి బంధువులు వెంటరాగా.. సింపుల్​గా తల్లిని సాగనంపాడు.ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. హీరా బెన్ ఆరోగ్యం క్షీణించడంతో  కుటుంబ సభ్యులు ఆమెను బుధవారం యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్‌‌లో జాయిన్ చేశారు. చికిత్స కొనసాగుతుండగానే శుక్రవారం తెల్లవారుజామున 3.30కి మృతి చెందారని డాక్టర్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ, కుటుంబ సభ్యుల సమక్షంలో గాంధీనగర్‌‌లో ఉదయం 9.30కి హీరా బెన్ అంత్యక్రియలు ముగిశాయి. తల్లి మరణం గురించి తెలియగానే ప్రధాని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. హీరాబెన్ పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి పంకజ్ మోడీ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న ప్రధాని.. పుష్పగుచ్ఛం ఉంచి తల్లికి నివాళులర్పించారు. తర్వాత తన సోదరులతో కలిసి కొద్దిదూరం పాడె మోశారు. మార్చురీ వ్యాన్‌లో హీరాబెన్ పార్థివ దేహం ఉంచగా.. అందులోనే ప్రధాని ప్రయాణించారు.సెక్టార్ 30లో హీరాబెన్​ అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి చితికి తన సోదరులతో కలిసి ప్రధాని నిప్పు అంటించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మాజీ సీఎంలు విజయ్ రూపానీ, శంకర్ సిన్హా వాఘేలా, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తదితరులు హాజరయ్యారు.

దేశ విదేశాల ప్రముఖుల సంతాపం

హీరాబెన్ మృతిపై దేశ విదేశాల ప్రముఖులు సంతాపాలు ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్‌కర్, జపాన్ ప్రధాని కిషిడ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక ప్రెసిడెంట్ విక్రమసింఘే, భూటాన్ ప్రధాని షెరింగ్, పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్ నడ్డా, అద్వానీ, కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్, పలు రాష్ట్రాల సీఎంలు, పార్టీల చీఫ్‌లు సంతాపం ప్రకటించారు. 

రైల్వేల గతిని మారుస్తున్నం: ప్రధాని మోడీ

రికార్డు స్థాయి పెట్టుబడులతో కేంద్రం రైల్వేల గతిని మారుస్తోందని ప్రధాని మోడీ అన్నారు. న్యూ జల్పాయ్​గురి సహా దేశంలోని చాలా రైల్వే స్టేషన్‌‌లను ఎయిర్​పోర్టుల తరహాలో అభివృద్ధి చేస్తున్నామని మోడీ చెప్పారు. ట్రాక్‌‌ల రెట్టింపు, ఎలక్ట్రిఫికేషన్​ పనులు వేగంగా సాగుతున్నాయని, తూర్పు, పశ్చిమ సరకు రవాణా కారిడార్లు దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తాయని అన్నారు. ప్రజలకు అడ్డంకులు లేని కనెక్టివిటీని అందించే దిశగా కొత్త ఎయిర్​పోర్ట్​లు, హార్బర్లు, రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. వందే భారత్ ఎక్స్‌‌ప్రెస్‌‌ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. ‘‘వందేమాతరం నినాదం వినిపించిన నేల నుంచి వందేభారత్ రైలును ప్రారంభించడం గొప్పగా ఉంది. 1943లో డిసెంబర్​30న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండమాన్, నికోబార్ దీవుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దానికి గుర్తుగానే ఈ రోజు వందే భారత్​ రైలు ప్రారంభించాం” అని చెప్పారు. బెంగాల్‌‌లో గంగానదిని క్లీన్​ చేయడానికి,  సురక్షితమైన మంచినీటిని అందించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.

గంటల వ్యవధిలోనే..

అహ్మదాబాద్: తల్లి హీరాబెన్ అంత్యక్రియలను ముగించుకుని గంటల వ్యవధిలోనే మళ్లీ అధికారిక కార్యక్రమా ల్లో పాల్గొన్నారు ప్రధాని మోడీ. తల్లి చనిపోయిన బాధను దిగమింగి వరుస ప్రోగ్రామ్​లతో బిజీగా గడిపారు. దహన సంస్కారాలు ముగిసిన కొద్ది గంటల్లోనే ఆయన హౌరా–న్యూజ ల్పాయ్​గురి మధ్య వందే భారత్​ రైలు, ఇతర అభివృద్ధి పనులను వర్చువల్​గా ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు అంత్యక్రియలు పూర్తయితే 11.30 గంటలకు అహ్మదాబాద్​లోని రాజ్​భవన్​ నుంచి ఆయన ఈ ప్రోగ్రామ్స్​కు హాజరయ్యారు. 12 గంటలకు కోల్​కతాలో జరిగిన నేషనల్​ గంగా కౌన్సిల్​ మీటింగ్​కు కూడా హాజరయ్యారు. వాస్తవానికి ప్రధాని మోడీ శుక్రవారం బెంగాల్​ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ రూ.7,800 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, భూమి పూజ చేయాల్సి ఉంది. కానీ తల్లి మరణంతో ఆయన నేరుగా అహ్మదాబాద్​ చేరుకున్నారు.