2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి ఇండియా రెడీ

2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి ఇండియా రెడీ
  •    గత పదేండ్లలో  దేశ క్రీడారంగంలో సమూల మార్పు: పీఎం మోదీ
  •     వారణాసిలో నేషనల్ వాలీబాల్ చాంపియన్‌‌షిప్‌‌ షురూ

వారణాసి: 2036 ఒలింపిక్ గేమ్స్‌‌‌‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇండియా పూర్తి సామర్థ్యంతో సన్నద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో మెగా స్పోర్ట్స్ ఈవెంట్లను నిర్వహించడం ద్వారా క్రీడాకారులకు ఎక్కువ పోటీ అవకాశాలను కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివారం వారణాసిలో ప్రారంభమైన సీనియర్ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ను ఉద్దేశించి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘2030 కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలో జరగనున్నాయి. అలాగే 2036 ఒలింపిక్స్‌‌‌‌ ఆతిథ్యం కోసం దేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. క్రీడాకారులకు అంతర్జాయతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకునేందుకు ఇది గొప్ప వేదిక అవుతుంది. ఖేలో ఇండియా వంటి పథకాలు దేశంలో క్రీడా ప్రతిభను వెలికితీయడంలో వందలాది మంది యువకులు నేషనల్ స్థాయికి చేరుకున్నారు’ అని పేర్కొన్నారు.  గత పదేండ్లలో క్రీడల పట్ల ప్రభుత్వ, సమాజ దృక్పథం మారిందన్నారు. ఈ టైమ్‌‌లో  ఫిఫా అండర్-17 వరల్డ్ కప్, హాకీ వరల్డ్ కప్​ లాంటి దాదాపు 20 ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఈవెంట్లను ఇండియా విజయవంతంగా నిర్వహించిందన్నారు.