పేద, మధ్య తరగతికి జీఎస్టీ పండుగ.. ఇయ్యాల్టి నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమలవుతయ్: ప్రధాని మోదీ

పేద, మధ్య తరగతికి జీఎస్టీ పండుగ.. ఇయ్యాల్టి నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమలవుతయ్: ప్రధాని మోదీ
  • రూ.12 లక్షల దాకా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చినం
  • పేదలకు ఇది డబుల్ బొనాంజా
  • విదేశీ వస్తువులు వద్దు.. స్వదేశీ వస్తువులే కొనండి
  • మేడ్​ ఇన్​ ఇండియాతోనే దేశం మరింత శక్తిమంతం
  • జీఎస్టీ సంస్కరణలతో దేశాభివృద్ధి
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​కు మరింత ఊతం
  • ఆత్మ నిర్భర్ భారత్​కు రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని పిలుపు
  • జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని

న్యూఢిల్లీ: పేద, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే చాలా వస్తువులపై జీఎస్టీ తగ్గించామని,  కొన్నింటిపై పూర్తిగా ఎత్తేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇప్పటికే రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి రిలీఫ్ ఇచ్చామని, ఇది వారికి డబుల్‌ బొనాంజా అని పేర్కొన్నారు. జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు.. దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని నొక్కి చెప్పారు. సోమవారం నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు.. మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని తెలిపారు.  వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయని అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయని, అదే రోజు నుంచి ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ కూడా స్టార్ట్ అవుతున్నదని తెలిపారు. జీఎస్టీతో వన్ నేషన్.. వన్ ట్యాక్స్ కలలు సాకారమయ్యాయని అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఇప్పటివరకు 12శాతం పరిధిలో ఉన్న 99శాతం వస్తువులు 5శాతం పరిధిలోకి వస్తాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని, హెల్త్ ఇన్సూరెన్స్, మెడిసిన్స్ ధరలు దిగివస్తాయని అన్నారు.

సరికొత్త చరిత్ర సృష్టించేందుకు దోహదం
జీఎస్టీ తగ్గింపు వల్ల పేద, మధ్య తరగతికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ మార్పుతో రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ డెవలప్​మెంట్ రేసులో అన్ని రాష్ట్రాలు సమానంగా పరుగులు పెడ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరింత ఊతమిస్తాయని, సరికొత్త చరిత్ర సృష్టించేందుకు దోహదం చేస్తాయని తెలిపారు.

‘‘యువత, రైతులు, మహిళలు, వ్యాపారవేత్తలు, దుకాణదారులు జీఎస్టీ సంస్కరణలతో లబ్ధి పొందుతారు. ఈ ఫెస్టివల్ సీజన్​లో దేశంలో ప్రతి ఒక్కరి సంతోషం, ఆనందం రెట్టింపు అవుతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. దేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకెళ్తుంది. 2017లో దేశం జీఎస్టీ అధ్యాయం మొదలైంది. అంతకుముందు ఎన్నోరకాల పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్నా పన్నులు కట్టాల్సి వచ్చేది. టోల్‌, ట్యాక్స్‌లతో కంపెనీలు ఇబ్బందిపడేవి. ఆ ప్రభావం వినియోగదారులపై పడేది. 2024లో గెలిచిన తర్వాత జీఎస్టీలపై ప్రాధాన్యం ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలతో అన్నీ వర్గాలతో మాట్లాడాం. జీఎస్టీ సంస్కరణలతో దేశం మరింత బలపడుతుంది’’అని ప్రధాని మోదీ అన్నారు.

ఎంఎస్​ఎంఈలకు ఇక మంచి రోజులు
జీఎస్టీలో తీసుకొచ్చిన మార్పులతో ఎంఎస్​ఎంఈలకు మంచి రోజులు వస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇక నుంచి జీఎస్టీలో కేవలం రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయని తెలిపారు. నాగరిక్‌ దేవోభవ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయాలి
చిన్న చిన్న కంపెనీలన్నీ నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసి ఈ సంస్కరణలను అవకాశంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆత్మ నిర్భర్ భారత్, స్వదేశీ ప్రోగ్రామ్​కు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో మ్యానుఫాక్చరింగ్ రంగం పరుగులుపెడుతుందని చెప్పారు. పెట్టుబడులు ఆకర్శించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేసినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని, పర్యాటక రంగానికి జీఎస్టీ సంస్కరణలు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. హోటల్స్ సేవలపైనా జీఎస్టీ తగ్గించామని తెలిపారు.

జీఎస్టీ సంస్కరణలు, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచడంతో దేశవ్యాప్తంగా ప్రజలకు రూ.2.50 లక్షల కోట్లు ఆదా అవుతాయి. భారతీయులంతా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను మాత్రమే కొనాలి. ‘ఇది ఇండియన్ ప్రొడక్ట్’ అని గర్వంగా చెప్పుకోవాలి. స్వదేశీ ఉద్యమంతో స్వాతంత్ర్య సమరం బలపడింది. ఇప్పుడు స్వదేశీ మంత్రంతో దేశం మరింత శక్తిమంతం అవుతుంది. కిచెన్​లో వాడే వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ గూడ్స్ వరకు అన్నీ స్వదేశీ వస్తువులే కొనాలి. అటు మెడిసిన్స్ నుంచి ఇటు ఆటో మొబైల్ ఎక్విప్​మెంట్ వరకు మేడ్ ఇన్ ఇండియా గూడ్సే కొనుగోలు చేయాలి. దేశానికి అవసరమయ్యే వస్తువులన్నీ ఇక్కడే తయారు చేసుకోవాలి. స్వయం సమృద్ధి ద్వారా దేశం మరింత అభివృద్ధి చెందుతుంది.

ప్రధాని నరేంద్ర మోదీ