పాలమూరు ప్రజల దర్శనంతో.. నా జీవితం ధన్యమైంది : ప్రధాని నరేంద్ర మోదీ

పాలమూరు ప్రజల దర్శనంతో.. నా జీవితం ధన్యమైంది :    ప్రధాని నరేంద్ర మోదీ
  • కాషాయమయమైన మహబూబ్​నగర్​ సిటీ

మహబూబ్​నగర్, వెలుగు: ‘చాలా రోజుల తర్వాత నాకు మీ దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. మీరు చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి ముగ్దుడినయ్యాను. పాలమూరు ప్రజలుగా మిమ్మల్ని దర్శనం చేసుకోవడంతో నా జన్మ ధన్యమైంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా భూత్పూర్​ మున్సిపాల్టీలోని అమిస్తాపూర్​లోని ఐటీఐ కాలేజ్​గ్రౌండ్​లో ఆదివారం నిర్వహించిన ‘పాలమూరు ప్రజా గర్జన’ సభకు ప్రధాని చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతుండగా ప్రజలంతా ఒక్కసారిగా ‘జై మోడీ.. జై మోడీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ప్రధాని నవ్వుతూ ఒక్క క్షణం తన ప్రసంగాన్ని ఆపేశారు. ‘మీ ఉత్సాహం చూస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలకు ఈ రోజు రాత్రి నిద్ర పట్టదు’ అని అనడంతో అందరూ ఈలలు, కేకలు వేశారు.

స్పెషల్​ అట్రాక్షన్​గా ఓపెన్​ టాప్​ జీప్..​

ప్రధాని రాక సందర్భంగా 30 ఎకరాల విస్తీర్ణంలో మూడు భారీ సభా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అందులో ఒక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి ప్రధాని రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు వర్చువల్​గా ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి ఓపెన్​ టాప్​ జీపులో ప్రధాని ఎక్కారు. దాదాపు 22 నిమిషాల పాటు రెండు సభా ప్రాంగణాల్లో తిరిగారు. మహిళలు, పార్టీ లీడర్లు ప్రధానిపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

లక్షకు పైగా తరలివచ్చిన జనం..

ప్రధాని రాక సందర్భంగా మహబూబ్​నగర్, నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్​కర్నూల్​ జిల్లాల నుంచి లక్షకు పైగా జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కొక్కరిగా రావడంతో 4 గంటల వరకు రెండు సభా ప్రాంగణాలు పూర్తిగా నిండిపోయాయి. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో దాదాపు 20 వేల మంది బయటే ఉండిపోయారు. సభా వేదిక నుంచి 4 కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా ప్రజలు గుంపులు గుంపులుగా కనిపించారు. పార్కింగ్​ స్థలాలు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. సభకు వచ్చే ప్రజలకు ఎక్కడికక్కడ వాటర్​ బాటిళ్లను అందుబాటులో ఉంచారు. వలంటీర్లు, బీజేపీ యువ మోర్చా, ఇతర లీడర్లు సహాయ సహకారాలు అందించారు.

పోలీసుల సేవలు భేష్​..

ప్రధాని సభ సందర్భంగా మూడు రోజులుగా పోలీసులు శ్రమిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు. నారాయణపేట, మహబూబ్​నగర్, హైదరాబాద్, గద్వాల, నాగర్​కర్నూల్​ ప్రాంతాల నుంచి సభకు వచ్చే వెహికిల్స్​కు వేర్వేరుగా పార్కింగ్​ స్థలాలు అలాట్​ చేశారు. దీంత ఎన్​హెచ్–​-44పై ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తలేదు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్​, జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్​ ఎంపీ బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి, నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్​రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్​కుమార్, వెంకటేశ్, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, పడాకుల బాలరాజు, ఎగ్గని నర్సింహులు, సుదర్శన్​రెడ్డి, మహబూబ్​నగర్​ పార్లమెంట్​ ఇన్​చార్జి డోకూరు పవన్​కుమార్​రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి పాల్గొన్నారు.

క్యాడర్​లో జోష్..


ప్రధాని సభ ఊహించిన దానికంటే గ్రాండ్​ సక్సెస్​ అయ్యింది. జన సమీకరణ చేయడంలో ఆ పార్టీ లీడర్లు విజయవంతం​ అయ్యారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్​ బస్సులతో పాటు టెంపో ట్రావెల్స్​ను ప్రజలను తరలించేందుకు అందుబాటులో ఉంచారు. సభ సక్సెస్​ కావడంతో క్యాడర్​లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇదే ఉత్సాహంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపించేందుకు ఆ పార్టీ లీడర్లు సిద్ధం అవుతున్నారు.