నేను బతికుండగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరు : మోదీ

నేను బతికుండగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరు  : మోదీ
  • ఈ ఎన్నికల్లో మీరు దేశ భవిష్యత్తును ఎన్నుకోబోతున్నారు
  • ఇండియా కూటమికి ఐదుగురు పీఎంలు.. సరైన నాయకుడే లేడు
  • కాంగ్రెస్ వస్తే.. రామ్.. రామ్​ అన్నోళ్లను అరెస్ట్ చేస్తుంది
  • భారత్​ను విభజించి రెండు ముస్లిం దేశాలుగా చేయాలని చూస్తోంది
  • హర్యానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని స్పీచ్   

మహేంద్రగఢ్(హర్యానా): తన కంఠంలో ప్రాణం ఉండగా.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎవ్వరూ లాక్కోలేరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వచ్చే ఐదేండ్లలో ఐదుగురు ప్రధానులు కావాలని ఇండియా కూటమి అంటున్నదని, ఆవు పాలు ఇవ్వకముందే వారు నెయ్యి కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హర్యానాలోని మహేంద్రగఢ్​లో గురువారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘ఓవైపు అన్నివిధాలా నిరూపించుకున్న మీ సేవక్​ మోదీ ఉంటే.. మరో వైపు (కూటమి)లో ఎవరు ఉన్నారో ఎవరికీ తెలియదు” అని విమర్శించారు. కూటమిలో కులతత్వ, మతతత్వ, బంధుప్రీతి గల పార్టీలే ఉన్నాయని అన్నారు.  ఎన్నికల్లో మీరు దేశ ప్రధాన మంత్రిని ఎంపిక చేసుకోవడంలేదని, దేశ భవిష్యత్తును ఎన్నుకుంటున్నారని అన్నారు. 

రామ్​.. రామ్​ అంటే అరెస్ట్ చేస్తరు..

కాంగ్రెస్​కు గనక అధికారం వస్తే రామ్​.. రామ్​ అని రామనామం పలికినోళ్లను కూడా అరెస్ట్​ చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ పార్టీ భారత్​ను విడదీసి రెండు ముస్లిం దేశాలుగా ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్​ అధికారంలో ఉంటే అయోధ్య రామ మందిరం పూర్తయ్యేదే కాదని చెప్పారు. ఇండియా కూటమి పవర్ లోకి వస్తే అయోధ్య రామ మందిరానికి తాళం వేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ అడ్వైజర్​ అంటున్నారని మోదీ ఫైర్​ అయ్యారు. అయితే, ఏడు జన్మలెత్తినా కాంగ్రెస్​ అధికారంలోకి రాదని, ఆ పార్టీకి ఓటువేస్తే వృథా అవుతుందని చెప్పారు. 

హర్యానా ప్రజలతో విడదీయరాని అనుబంధం

హర్యానా ప్రజలతో తనకు విడదీయరాని అనుబంధం ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. 1990లో రాష్ట్రంలో బీజేపీ కోసం పని చేసినప్పటి అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. తనపై ఇక్కడి ప్రజలు చాలా ప్రేమను కురిపించారని తెలిపారు. హర్యానా అభివృద్ధి ఆగబోదని ప్రజలకు తాను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్​  పాపాలను తుడిచేసేందుకు తాము పదేండ్ల పాలనలో ఎంతో కష్టపడి పని చేశామని ప్రధాని తెలిపారు.