అవినీతి నేతల బండారం బయటపెట్టాలన్న పీఎం

అవినీతి నేతల బండారం బయటపెట్టాలన్న పీఎం

నాగ్ పూర్/పణజి: దేశానికి షార్ట్ కట్ పాలిటిక్స్ అవసరం లేదని, సస్టయినబుల్ డెవలప్మెంటే కావాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలు షార్ట్ కట్ పొలిటీషియన్లను తిరస్కరించాలని, అవినీతి నేతల బండారం బయటపెట్టాలని పిలుపునిచ్చారు. ‘‘షార్ట్ కట్ లీడర్లు ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బును దోచుకుంటారు. తప్పుడు హామీలతో అధికారాన్ని చేజిక్కించుకుంటారు. ఇలాంటి పాలిటిక్స్ తో దేశం అభివృద్ధి చెందదు. అందుకే షార్ట్ కట్ లీడర్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి” అని ప్రధాని హెచ్చరించారు. ఆదివారం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో పర్యటించిన మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను, ఎయిమ్స్ దవాఖానను, నాగ్ పూర్ మెట్రో ఫస్ట్ ఫేజ్ ను, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రూ. 75 వేల కోట్లతో చేపట్టిన 11 అభివృద్ధి పనులు రాష్ట్రానికి అభివృద్ధి రత్నాలు అని అభివర్ణించారు. గత ప్రభుత్వాలు మహారాష్ట్రలోని భండారా జిల్లాలో గోషిఖుర్ద్ డ్యాం ప్రాజెక్టును కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో పెట్టాయని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు నిర్మాణం ఇప్పుడు తుది దశకు చేరుకుందన్నారు. 

డోలు వాయించి.. మెట్రో జర్నీ 

నాగ్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీకి డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని కూడా కళాకారులతో కలిసి ఉత్సాహంగా డోలు వాయించారు. అనంతరం మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా జీరో మైల్ ఫ్రీడం పార్క్ స్టేషన్ లో టికెట్ కొని ఖాప్రి స్టేషన్ వరకూ మెట్రోలో ప్రయాణించారు. రైళ్లో  తనతో పాటు ప్రయాణించిన ఎయిమ్స్ విద్యార్థులు, తదితరులతో ముచ్చటించారు. సమృద్ధి ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన తర్వాత కూడా మోడీ కారులో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించి, అందులోని ప్యాసింజర్లకు చేయి ఊపుతూ టాటా చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచం చూపు ఆయుర్వేదం వైపు

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల వైద్య విధానాలను ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు తిరిగి పురాతన వైద్య విధానమైన ఆయుర్వేదం వైపు మళ్లుతున్నారని మోడీ అన్నారు. ఆదివారం గోవాలో 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్, ఆరోగ్య ఎక్స్ పో కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. గోవాలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఘజియాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ​యునానీ మెడిసిన్, ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ మోమియోపతీ సంస్థలను ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 30కి పైగా దేశాలు ఆయుర్వేదాన్ని సంప్రదాయ వైద్య విధానంగా గుర్తించాయని చెప్పారు. గత ఎనిమిదేండ్లలో దేశంలో ఆయుష్ ఇండస్ట్రీ రూ. 20 వేల కోట్ల నుంచి రూ. 1.50 లక్షల కోట్లకు ఎదిగిందన్నారు.

ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే.. 

వందే భారత్ ఎక్స్ ప్రెస్: ఇది దేశంలో ఆరో వందే భారత్ ట్రెయిన్. నాగపూర్, -బిలాస్ పూర్ మధ్య నడుస్తుంది. నాగ్ పూర్–ముంబై సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే: ఇది నాగ్ పూర్ సిటీని, షిర్డీ టౌన్ ను అనుసంధానం చేస్తుంది. ఈ హైవేతో రాష్ట్రంలోని 24 జిల్లాల వ్యాపారులకు, రైతులకు, ప్రయాణికులకు లబ్ధి కలగనుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే పొడవు మొత్తం 701 కిలోమీటర్లు కాగా, ఫస్ట్ ఫేజ్ లో 520 కిలోమీటర్ల మేరకు పూర్తి చేశారు. నాగ్ పూర్ మెట్రో రైల్ ఫేజ్1: సిటీలో మొదటి దశ మెట్రోను 39 కిలోమీటర్ల పొడవున నిర్మించారు. 38 స్టేషన్లు ఏర్పాటు చేశారు. నాగ్ పూర్ ఎయిమ్స్: సిటీలోని వార్ధా రోడ్ లో అత్యాధునిక మెడికల్ ఫెసిలిటీలతో రూ. 1,575 కోట్ల ఖర్చుతో ఈ దవాఖానను ఏర్పాటు చేశారు. 

శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులివే.. 

నాగ్ పూర్, అజ్ని రైల్వేష్టేషన్ల రీడెవలప్ మెంట్ ప్రాజెక్టులు, నాగ్ నది ప్రక్షాళన ప్రాజెక్టు, సీపెట్ (సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ భవనాల నిర్మాణానికి, నాగ్ పూర్ మెట్రో రైల్ ఫేజ్ 2 పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు.