ఎస్సీ వర్గీకరణపై ..కమిటీ వేస్తం : మోదీ

ఎస్సీ వర్గీకరణపై ..కమిటీ వేస్తం : మోదీ
  • మాదిగలకు న్యాయం చేస్తం : మోదీ
  • దళితులకు సీఎం కుర్చీ అని చెప్పి కేసీఆర్​ కబ్జా చేసిండు
  • రాజ్యాంగాన్ని మార్చేస్తానంటూ అంబేద్కర్​ను అవమానించిండు
  • ఇరిగేషన్​ స్కీమ్​ల పేరిట బీఆర్​ఎస్​ స్కామ్​లు చేస్తున్నది
  • నాడు ఎన్నికల్లో అంబేద్కర్​ గెలువకుండా కాంగ్రెస్​ అడ్డుకుంది
  • ఆయన ఫొటోను కూడా పార్లమెంట్​ సెంట్రల్​ హాల్​లో పెట్టలేదు
  • అవినీతిలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఒక్కటే.. వాటితో జాగ్రత్త
  • సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’లో ప్రధాని ప్రసంగం

హైదరాబాద్‌, వెలుగు : ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలకడానికి  త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేసి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 30 ఏండ్లుగా సాగుతున్న మాదిగల పోరాటంలో తాను తోడుగా ఉంటానని, మంద కృష్ణ  నేతృత్వంలో ఒక సహాయకుడిగా పనిచేస్తానని ఆయన చెప్పారు. శనివారం సికింద్రాబాద్​ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన అణగారినవర్గాల విశ్వరూప మహాసభకు ప్రధాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘‘మాదిగ జాతిలోని ప్రతి బిడ్డ న్యాయం కోసం మూడు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నరు.  అహింసా మార్గంలో ముందుకు సాగుతున్నరు. వారందరికీ నా ప్రణామాలు” అని తెలిపారు. మాదిగల ఉద్యమంపై తనకు పూర్తి అవగాహన ఉందని, వారికి అండగా ఉంటానని చెప్పారు. ‘‘న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో నడుస్తున్నది. మాదిగల ఉద్యమాన్ని న్యాయమైన పోరాటంగా భావిస్తున్నం.. అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ద్వారా కోర్టులో మాదిగలకు న్యాయం జరగాలన్నదే మా ఆకాంక్ష.. మేం పూర్తిగా న్యాయం పక్షాన నిలబడ్తం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నం” అని ప్రకటించారు. 

బంగారు లక్ష్మణ్​ వంటి గొప్ప నాయకుల దగ్గర శిక్షణ పొందే అవకాశం తనకు దక్కిందని, అది అదృష్టంగా భావిస్తున్నానని మోదీ  పేర్కొన్నారు. అందరూ తనను ప్రధానమంత్రిగా పిలుస్తున్నా.. తాను మాత్రం ప్రజలకు ప్రధాన సేవకుడ్ని అని ఆయన అన్నారు. 

బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఒక్కటే

దశాబ్దాల ఉద్యమం, ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే..  పదేండ్లు పాలన సాగించిన బీఆర్ఎస్​ మాత్రం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణ గౌరవాన్ని, అస్థిత్వాన్ని బీఆర్‌‌ఎస్‌‌ సర్కారు కాపాడలేకపోయిందని మండిపడ్డారు. పదేండ్లలో బీఆర్​ఎస్​ సర్కారు మాదిగలకు తీవ్ర ద్రోహం చేసిందని, దళితున్ని మొదటి సీఎం చేస్తానని చెప్పి కేసీఆరే ఆ సీఎం కుర్చీని కబ్జా చేశారని ఆయన అన్నారు. దళితులకు మూడెకరాల భూమిలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, దళితబంధు స్కీమ్​ బీఆర్​ఎస్​ నేతల బంధువులకే స్కీమ్​గా మారిందని  మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఇవ్వలేదని అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల స్కీమ్​ల పేరిట బీఆర్​ఎస్​ సర్కార్​ స్కామ్​లు చేసిందని ఆరోపించారు.

బీఆర్‌‌ఎస్‌‌ నేతలు ఢిల్లీలోని ఆమ్‌‌ ఆద్మీ పార్టీతో కలిసి లిక్కర్‌‌ స్కామ్‌‌కు పాల్పడ్డారని, సహజంగా మంచి  పనికోసం సహకరించుకుంటే వీళ్లు కరప్షన్‌‌లో సహకరించుకుంటున్నారని ఆయన విమర్శించారు. అవినీతిలో కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ వేరు వేరు కాదని అన్నారు. ‘‘రాష్ట్రంలో బీఆర్‌‌ఎస్‌‌ ,  కాంగ్రెస్‌‌  పోట్లాడుకున్నట్లు నాటకాలు ఆడుతున్నయ్​. కానీ, ఆ రెండూ కలిసే ఉన్నయ్​. కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ ఒక వైపు ఉంటే.. బీజేపీ మరోవైపు ఉంది. వాళ్లు అధికారం అనుభవించడానికి పోటీలో ఉంటే.. ప్రజలకు సేవ చేయడం కోసం బీజేపీ ఉంది” అని ప్రధాని మోదీ తెలిపారు. 

మీ బాధలు పంచుకోవడానికి వచ్చా..

‘‘నేను ఈ రోజు మిమ్మల్ని ఏమీ అడగడానికి రాలేదు.. మీ బాధలు పంచుకోవడానికి వచ్చా. స్వాతంత్ర్యం తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారు. నేను వారి పాపాలను క్షమించడానికి, మాదిగ సోదరులకు న్యాయం చేయడానికి వచ్చాను” అని ప్రధాని తెలిపారు.  తెలంగాణలో రైతులను ఆదుకోవడానికి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని తెలిపారు. ఈ వానాకాలం 20 లక్షల టన్నులు బాయిల్డ్‌‌ రైస్​ తీసుకుంటామని ప్రకటించారు. బీజేపీనే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని అన్నారు.

ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామని, సెల్​ఫోన్​ ఫ్లాష్‌‌  లైట్స్​ వేసి మద్దతు తెలిపాలని ప్రధాని మోదీ కోరారు. దీంతో సభకు వచ్చినవారు ఫ్లాష్​ లైట్స్​ వేసి మద్దతు ఇచ్చారు. విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ షెడ్యూల్​కన్నా గంట ఎక్కువసేపు ఉన్నారు.  సభ లో మోదీ మాట్లాడు తున్న సమయంలో ఫ్లడ్​లైట్ల కోసం ఏర్పాటు చేసిన టవర్​లో షార్ట్​సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. గమనించిన ప్రధాని మోదీ అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని ప్రజలకు సూచించారు.  

ఆ పార్టీలకు దళితులంటే చిన్నచూపు

‘‘మాదిగ సోదరులకు స్పష్టంగా తెలియచేస్తున్నా.. బీఆర్‌‌ఎస్​తో ఎంత జాగ్రత్తగా ఉండాల్నో కాంగ్రెస్‌‌తో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అనేక బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. ఇక్కడి పోరాట యోధుల్ని వదిలి కేసీఆర్‌‌ కాంగ్రెస్‌‌ వాళ్లకు ధన్యవాదాలు తెలుపడానికి పోయిండు. బీఆర్‌‌ఎస్‌‌ దళిత విరోధి, కాంగ్రెస్‌‌ దాంట్లో తక్కువేం కాదు. రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ అంబేద్కర్​ను కేసీఆర్​ అవమానించిండు” అని మోదీ అన్నారు. దళితులను కాంగ్రెస్‌‌ ఎట్ల ఇబ్బందులు పెట్టిందో ప్రజలు ఎన్నటికీ మరువలేరని పేర్కొన్నా రు. ‘‘బాబా సాహెబ్‌‌ అంబేద్కర్‌‌ రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్​ పార్టీ గెలువనీయలేదు.

దశాబ్దా లుగా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పార్లమెంట్‌‌ సెంట్రల్‌‌ హాల్​లో అంబేద్కర్​ ఫొటో పెట్టనీయ లేదు. బాబు జాగ్జీవన్‌‌ రామ్‌‌ ను రాజకీయంగా కక్షకట్టి అణచివేసింది.  రామ్‌‌నాథ్‌‌ కోవింద్‌‌ను రాష్ట్రపతి అభ్య ర్థిగా బీజేపీ ప్రకటిస్తే కాంగ్రెస్​ వ్యతిరేకించింది.. తిరస్కరించింది.. ఓడించడానికి ప్రయత్నిచింది. ఆదివాసీ మహిళ ద్రౌపతిముర్మును రాష్ట్రపతిగా బీజేపీ ప్రకటిస్తే కాంగ్రెస్​ అడ్డుకోవడానికి ప్రయత్నించింది” అని మండిపడ్డారు.  

మీటింగ్​లో ​టవర్ ​ఎక్కిన యువతి 

అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన ఎదురయ్యింది. ఎస్సీ వర్గీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయడంతో సరిత అనే యువతి సికింద్రాబాద్ ​పరేడ్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన లైటింగ్​టవర్​ఎక్కి నిరసన తెలిపింది. ఆమె టవర్ ఎక్కడాన్ని చూసిన ప్రధాని మోదీ వెంటనే స్పందించారు. ‘‘బేటా షార్ట్ సర్క్యూట్​అవుతుంది.. నేను మీకోసమే ఇక్కడికి వచ్చా.. కిందికి దిగు..’’ అని విజ్ఞప్తి చేశారు. కిందికి దిగిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కొట్లాడుకుంటున్నట్లు నాటకాలు ఆడుతున్నయ్​. కానీ, ఆ రెండూ కలిసే ఉన్నయ్​. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక వైపు ఉంటే.. బీజేపీ మరోవైపు ఉంది. వాళ్లు అధికారం అనుభవించడానికి పోటీలో ఉంటే.. ప్రజలకు సేవ చేయడం కోసం బీజేపీ ఉంది.

ప్రధాని మోదీ