పార్లమెంట్​లో ఈసారి కేరళ గొంతు విన్పించాలి : నరేంద్ర మోదీ

పార్లమెంట్​లో ఈసారి కేరళ గొంతు విన్పించాలి : నరేంద్ర మోదీ
  •     ఇది కేవలం బీజేపీతోనే సాధ్యమన్న ప్రధాని మోదీ
  •     కేరళలో ఎన్నికల ప్రచారం
  •     విజయన్ సర్కారుతో పాటు కాంగ్రెస్ పై విమర్ళలు

త్రిస్సూర్: పార్లమెంట్ లో ఈసారి కేరళ వాయిస్ వినిపించాల్సిందేనని, అది బీజేపీతో మాత్రమే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలవాలని కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన కేరళలోని కున్నంకుళం సమీపంలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సభావేదికగా విజయన్ ప్రభుత్వం, వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీపైనా మోదీ విమర్శలు చేశారు. 

కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్​లోని అమేథీలో తన సీటును కాపాడుకోలేకపోయారని విమర్శించారు. కేరళ నుంచి మళ్లీ ఇప్పుడు ఓట్లడగడం తప్ప రాష్ట్రానికి రాహుల్ చేసేదేంలేదని ఆరోపించారు. కేరళలో అధికార సీపీఐ(ఎం) నియంత్రణలో ఉన్న కరువన్నూరు కోఆపరేటివ్​ బ్యాంక్​ స్కామ్​పై రాహుల్​ కనీసం స్పందించలేదని దుయ్యబట్టారు. ఇప్పటిదాకా ప్రజలు చూసింది ఎన్డీఏ పాలనలో అభివృద్ధి ట్రైలర్​ మాత్రమేనని, అసలు అభివృద్ధి ముందున్నదని తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా నిషేధానికి గురైన పాపులర్​ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా(పీఎఫ్​ఐ) మద్దతును కాంగ్రెస్​ పార్టీ తీసుకుందన్నారు.

ప్రజల సొమ్ము దోచుకుంటున్న అధికార పార్టీ

కరువన్నూర్ కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్​తో అధికార సీపీఎం పార్టీ రాష్ట్రంలోని పేదలను దోచుకుంటున్నదని, ప్రజలకు అబద్ధాలు చెబుతోందని మోదీ మండిపడ్డారు. ఈ స్కామ్​లో ఈడీ దాడులు ఎదుర్కొన్న వ్యక్తి.. ఏజెన్సీ సీజ్​ చేసిన అక్రమ సొమ్మును డిపాజిటర్లకు ఎలా ఇచ్చేయాలన్న దానిపై లీగల్ అడ్వైజ్​​ తీసుకుంటున్నాడని చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యూడీఎఫ్​, అధికార ఎల్డీఎఫ్​లు రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని దుయ్యబట్టారు. 

త్రిపుర, బెంగాల్​, కేరళలో లెఫ్ట్​ పార్టీ విధానం ఒకటేనని.. ఆ పార్టీ ఉన్నచోట ఏదీ మిగలదు, ఏ అభివృద్ధి జరగదన్నారు. ‘కేరళలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. రాజకీయ హత్యలు జరుగుతున్నాయి. క్యాంపస్​లలో అసాంఘిక ఉద్యమాలు నడుస్తున్నాయి. మన పిల్లలు భద్రంగా లేరు’ అని ఆరోపించారు. లోక్​సభ ఎన్నికల తర్వాత పార్లమెంట్​లో కేరళ తన గళం వినిపిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కేరళ వారసత్వాన్ని గ్లోబల్​గా పెంచేందుకు రాబోయే ఐదేండ్లలో హైవేలు, ఎక్స్​ప్రెస్​వేలు, వందేభారత్​ రైళ్లతో రాష్ట్రాన్ని ప్రపంచానికి అనుసంధానిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

దేశాన్ని బలోపేతం చేశాం

కాంగ్రెస్ పార్టీ దేశ ప్రతిష్టను దిగజారిస్తే.. బీజేపీ పాలనలో దేశాన్ని బలోపేతం చేశామని మోదీ తెలిపారు. రాబోయే ఎన్నికలు ప్రజలు, వారి పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ఎన్డీఏ సర్కారు మూడోసారి అధికారంలోకి రాగానే అహ్మదాబాద్​– ముంబైలాగా ఉత్తర, తూర్పు, దక్షిణ భారతంలో బుల్లెట్​ రైళ్ల కోసం సర్వే మొదలవుతుందని తెలిపారు. దీంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఊపందుకుంటుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కేరళతోపాటు దేశ ప్రగతికి ఇంకా ఎంతో చేయాల్సి ఉన్నదని, దక్షిణాది ప్రజలు మద్దతివ్వాలని మోదీ అభ్యర్థించారు.