బెంగళూరుకు ప్రధాని.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించనున్న మోదీ

బెంగళూరుకు ప్రధాని.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించనున్న మోదీ

చంద్రునిపైకి విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌పై ఇస్రో బృందానికి అభినందనలు తెలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజు (ఆగస్టు 26న) ఉదయం బెంగళూరుకు వెళ్లనున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన సందర్భంగా.. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించనున్నారు. 

చంద్రయాన్‌-3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై విజయవంతంగా దిగిన సమయంలో భారత్‌లో లేని ప్రధాని మోదీ.. ఈ అద్భుత ఘట్టాన్ని వర్చువల్‌గా దక్షిణాఫిక్రా నుంచి వీక్షించారు. అయితే.. విదేశాల నుంచి తిరిగి రాగానే ఇస్రో శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి అభినందనలు తెలుపనున్నారు. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైంటిస్టులను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని మోదీ శనివారం (ఆగస్టు 26న) కర్ణాటకలో పర్యటించనున్నారు. ప్రధాని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) వద్ద ఒక గంట సమయం గడపనున్నారు. ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలతో భేటీ కానున్నారు. 

బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ఉదయం 8.05 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 8.35 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.