కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహిస్తున్నారు. పండగల సీజన్ కావడంతో కొత్త వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో కరోనా రూల్స్ ను పాటించేలా ప్రజలకు స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే విదేశాల నుంచి వచ్చే సందర్శకులను పరీక్షిస్తున్నారు. రాబోయే ఏడు రోజుల్లో క్వారంటైన్, టెస్టుల కోసం మౌలికసదుపాయాలను పునరుద్దరించే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
కేంద్ర ప్రభుత్వం అలెర్ట్...
కరోనా కొత్త వేరియంట్ ముప్పు ముంచుకొస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఆయా రాష్ట్రాల వైద్యాధికారులు హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. యూపీలో పరిస్థితిపై ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ సమీక్షించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. పాజిటివ్ కేసులకు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ ను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ టెస్టుల సంఖ్య పెంచాలన్నారు.
సాయంత్రం మంత్రి హరీశ్ రావు సమీక్ష...
తెలంగాణాలో తాజా పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సమీక్షించనున్నారు. సాయంత్రం వైద్యాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తవేరియంట్లు ప్రభలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ఎయిర్ పోర్టుల్లో విస్తృత తనిఖీలతో పాటు.. రద్దీ ప్రదేశాల్లో కరోనా రూల్స్ పాటించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
వేగంగా BF-7 వ్యాప్తి...
కొత్త వేరియంట్ BF-7 వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు వైద్యులు. ఈ వేరియంట్ కు బలమైన రీఇన్ ఫెక్షన్ కలిగించే సామర్థ్యం కూడా ఉందన్నారు. ఇంక్యుబేషన్ వ్యవధి కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కూడా ఈ వైరస్ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. చైనాతో పాటు.. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్,డెన్మార్క్ దేశాల్లో ఈ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని సైంటిస్టులు వెల్లడించారు.
