భారత రాజ్యాంగం వల్లే నేను ఈ స్థాయికి వచ్చా: మోదీ 

భారత రాజ్యాంగం వల్లే నేను ఈ స్థాయికి వచ్చా: మోదీ 

పూర్నియా/గయ/బలూర్ ఘాట్/రాయిగంజ్: అట్టడుగు స్థాయి నుంచి ప్రధాని పదవి చేపట్టే స్థాయికి తాను ఎదగడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగానికి తాను ఎంతగానో రుణపడి ఉన్నానని చెప్పారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. నిజానికి కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎమర్జెన్సీ పెట్టారని కౌంటర్ ఇచ్చారు. మంగళవారం బిహార్, బెంగాల్​లో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మోదీ మాట్లాడారు. రాజ్యాంగాన్ని గౌరవించడం వల్లే తాము బడుల నుంచి సుప్రీంకోర్టు, పార్లమెంట్ దాకా అన్ని సంస్థల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు.

తాము రాజ్యాంగాన్ని రామాయణం, బైబిల్, ఖురాన్ మాదిరిగా భావిస్తున్నామన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిని శిక్షించేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కారణంగానే దేశంలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, తాము మరోసారి అధికారంలోకి వస్తే సీఏఏ అమలుతో అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. కాగా, ప్రధాని ర్యాలీలకు ఎన్డీఏ కూటమిలోని జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్ గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయింది. బెంగాల్​లోని టీఎంసీ ప్రభుత్వం చొరబాటుదారులకు అండగా ఉంటోందని, సీఏఏను వ్యతిరేకిస్తోందని మోదీ విమర్శించారు. మంగళవారం బెంగాల్​లోని బలూర్ ఘాట్, రాయిగంజ్​లలో జరిగిన ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. బెంగాల్ ను రౌడీలు, చొరబాటుదారులకు టీఎంసీ లీజ్ కు ఇచ్చిందని మోదీ మండిపడ్డారు.

రామనవమి ర్యాలీలపై..

శ్రీరామ నవమి ర్యాలీలపై మోదీ, మమతా బెనర్జీ మధ్య మాటలయుద్ధం సాగింది. బుధవారం నవమి సందర్భంగా రాష్ట్రంలో ర్యాలీలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో వీహెచ్ పీ, అంజనీ పుత్ర సేన సంస్థలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు కొన్ని షరతులతో ర్యాలీలకు సోమవారం అనుమతినిచ్చింది. ఈ అంశంపై ప్రధాని మోదీ మంగళవారం దక్షిణ దినాజ్ పూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో స్పందిస్తూ.. బెంగాల్​లో రామనవమి వేడుకలు నిర్వహించకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందని, కానీ ర్యాలీలకు కలకత్తా హైకోర్టు అనుమతివ్వడం యువత సాధించిన విజయమన్నారు. కాగా, బీజేపీ ఫేక్ వీడియోల ఉచ్చులో మైనార్టీలు పడొద్దంటూ మమత కామెంట్ చేసింది.