కూకట్పల్లి, వెలుగు : ప్రిన్స్ టన్ ఇంజినీరింగ్‌కాలేజీ యాజమాన్యం పరీక్ష ఫీజులు కట్టించుకోకుండా విద్యార్థులను వేధిస్తోందని జేఎన్టీయూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు దిలీప్, రాహుల్‌నాయక్ అన్నారు. కాలేజీ యాజమాన్యం వైఖరిని ఖండిస్తూ బుధవారం వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఫోరం నాయకులు మాట్లాడుతూ ప్రిన్స్టన్ యాజమాన్యం సీఆర్టీ ఫీజు పేరుతో విద్యార్థుల నుంచి అక్రమంగా వేల రూపాయలు వసూలు చేసిందని ఆరోపించారు. జేఎన్టీయూ అధికారులు వెంటనే సదరు కాలేజీపై చర్యలు తీసుకుని విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజులు కట్టించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటేశ్వర్రావు కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు దుర్గాప్రసాద్, శ్రీను, చందు, హేమంత్, రంజిత్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
